FSSAI Order: బయట మార్కెట్లో చిప్స్, బిస్కెట్లు లేదా ఇతర ప్యాకెట్ ఆహార పదార్థాలు కొనేటప్పుడు, వాటి వెనుక భాగంలో చిన్న అక్షరాలతో రాసి ఉండే వివరాలను కష్టపడి చదవాల్సిన అవసరం ఇకపై ఉండదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అధిక చక్కెర, ఉప్పు, శాచురేటెడ్ ఫ్యాట్ ఉండే ప్యాకెట్ ఫుడ్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరిక ముద్రించాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్ ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ తీర్పు ఇస్తూ, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా భాగమని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే దేశం ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందని అభిప్రాయపడింది.

ప్యాకెట్ ముందు భాగంలో ఎరుపు హెచ్చరిక గుర్తు ఎలా ఉంటుంది?

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI)కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఆహార పదార్థంలో హానికర స్థాయిలో ఉండే ఫ్యాట్, షుగర్, ఉప్పు కోసం విడివిడిగా ఎరుపు రంగు షడ్భుజి ఆకారపు లేబుల్స్ వేయాలి. ఆ లేబుల్ లోపల స్పష్టమైన బొమ్మతో పాటు పెద్ద అక్షరాల్లో “HIGH FAT”, “HIGH SUGAR” లేదా “HIGH SALT” అని రాసి ఉండాలి. వినియోగదారులు దూరం నుంచే సులభంగా గుర్తించేలా, ప్రతి ఎరుపు హెచ్చరిక గుర్తు ప్యాకెట్ ముందు భాగంలో కనీసం 4 నుంచి 5 శాతం విస్తీర్ణంలో ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.

చక్కెర, కొవ్వు పరిమితులపై కొత్త కొలమానాలు

లేబులింగ్ ప్రమాణాలను కూడా పూర్తిగా మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. కేవలం బయటి నుంచి కలిపే చక్కెర మాత్రమే కాకుండా, ఆహార పదార్థంలో సహజంగా ఉండే మొత్తం చక్కెర, శాచురేటెడ్ ఫ్యాట్, ఉప్పు ఆధారంగా ఈ హెచ్చరికలు నిర్ణయించాలి. దీనికోసం పరిమితులను కొత్తగా రూపొందించాలని, DGI 2024 టేబుల్ 15.1 నిబంధనలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కంపెనీలకు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేందుకు 365 రోజుల గడువు ఇస్తామన్న FSSAI ప్రతిపాదనపై కూడా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

FSSAIకి 4 నెలల కఠిన గడువు

సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త డ్రాఫ్ట్ నిబంధనలను రూపొందించడానికి FSSAIకి కోర్టు 4 నెలల గడువు ఇచ్చింది. ఈ విషయంలో ఎలాంటి జాప్యం సహించేది లేదని ధర్మాసనం హెచ్చరించింది. అంతేకాకుండా సరిగ్గా 10 వారాల తర్వాత తమ పనుల పురోగతిపై కోర్టుకు నివేదిక సమర్పించాలని FSSAIని ఆదేశించింది.

పాఠశాల సిలబస్‌లో పోషకాహార విద్య

కేవలం ప్యాకెట్లపై హెచ్చరికలు ముద్రించడమే కాకుండా, చిన్నప్పటి నుంచే పిల్లల్లో అవగాహన పెంచాలని సుప్రీంకోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో న్యూట్రిషనల్ లిటరసీ కార్యక్రమాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం స్కూల్ సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించాలని పేర్కొంది. బాల్యం నుంచే సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన ఉంటే, భావితరాలు జంక్ ఫుడ్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.

Next Story