ప్రపంచ టాప్-30 టెక్ కంపెనీల జాబితాలో స్థానం

Reliance Industries : రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థ. ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోని టాప్-30 టెక్ కంపెనీల జాబితాలో స్థానం సంపాదించుకుంది. 340 పేజీల 'ట్రెండ్స్ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' నివేదికలో ఈ టాప్-30 జాబితా ఉంది. ఇందులో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ 23వ స్థానంలో నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జాబితాను ప్రతేడాది ప్రచురిస్తూనే ఉన్నారు. అయితే ఇదే మొదటిసారి ఒక భారతీయ కంపెనీ ఇందులో స్థానం సంపాదించుకోవడం విశేషం. ఈ జాబితాలో షేర్ మార్కెట్‌లో లిస్ట్ చేయబడిన టెక్నాలజీ కంపెనీలను మాత్రమే పరిగణించారు. అత్యధిక మార్కెట్ మూలధనం కలిగిన కంపెనీలు ఇందులో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 216 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో 23వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సంస్థ 3.36 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉంది.

ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలి 8 కంపెనీలు అమెరికాకు చెందినవే. టాప్-30 జాబితాలో చైనాకు చెందిన 3 కంపెనీలు, జర్మనీకి చెందిన 2 కంపెనీలు, నెదర్లాండ్స్, కొరియా, భారత్, తైవాన్‌కు చెందిన తలా ఒక్కొక్క కంపెనీ ఉన్నాయి. మిగిలిన 21 కంపెనీలు అమెరికాకు చెందినవే కావడం విశేషం. ఇది ప్రపంచ టెక్నాలజీ మార్కెట్‌లో అమెరికా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది.

2025లో అత్యధిక మార్కెట్ మూలధనం కలిగిన టాప్-30 టెక్ కంపెనీలు:

1. మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెరికా: 3.368 ట్రిలియన్ డాలర్లు

2. ఎన్విడియా (NVIDIA), అమెరికా: 3.288 ట్రిలియన్ డాలర్లు

3. యాపిల్ (Apple), అమెరికా: 3.158 ట్రిలియన్ డాలర్లు

4. అమేజాన్ (Amazon), అమెరికా: 2.178 ట్రిలియన్ డాలర్లు

5. ఆల్ఫాబెట్ (Alphabet), అమెరికా: 1.997 ట్రిలియన్ డాలర్లు

6. మెటా (Meta), అమెరికా: 1.619 ట్రిలియన్ డాలర్లు

7. టెస్లా (Tesla), అమెరికా: 1.104 ట్రిలియన్ డాలర్లు

8. బ్రాడ్‌కామ్ (Broadcom), అమెరికా: 1.094 ట్రిలియన్ డాలర్లు

9. టీఎస్ఎంసీ (TSMC), తైవాన్: 856 బిలియన్ డాలర్లు

10. టెన్సెంట్ (Tencent), చైనా: 591 బిలియన్ డాలర్లు

23. రిలయన్స్ (Reliance), భారత్: 216 బిలియన్ డాలర్లు

మూడు దశాబ్దాల తర్వాత కూడా నిలదొక్కుకున్న కంపెనీలు!

ఆసక్తికరంగా.. 30 సంవత్సరాల క్రితం టాప్-30 జాబితాలో ఉన్న కంపెనీలలో ఐదు మాత్రమే ఇప్పుడు ఈ జాబితాలో కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో, ఐబీఎం, ఎటి అండ్ టి గత 30 సంవత్సరాలుగా తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాయి. రిలయన్స్ వంటి భారతీయ కంపెనీ ఈ జాబితాలోకి ప్రవేశించడం, భారతదేశ టెక్నాలజీ , మార్కెట్ వృద్ధికి సంకేతంగా నిలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story