Oil Imports : ట్రంప్ టారిఫ్ భయం..రష్యా చమురు దిగుమతులపై ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన
రష్యా చమురు దిగుమతులపై ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన

Oil Imports : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో రిలయన్స్ ఇచ్చిన ఈ వివరణ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. రష్యా నుంచి ముడి చమురుతో నిండిన మూడు భారీ నౌకలు గుజరాత్ లోని రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ వైపు వస్తున్నాయని ఆ వార్తలో పేర్కొంది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చింది. తమ అఫీషియల్ ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. "గత మూడు వారాలుగా రష్యా నుంచి ఎటువంటి ముడి చమురు జామ్‌నగర్ రిఫైనరీకి రాలేదని, జనవరి నెలలో కూడా రష్యా నుంచి ఎటువంటి డెలివరీలను తాము ఆశించడం లేదని" స్పష్టం చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించడంపై కంపెనీ విచారం వ్యక్తం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ సహకరించకపోతే, భారతీయ వస్తువులపై సుంకాలను మరింత పెంచుతామని బెదిరించారు. గత ఏడాది ఆగస్టులోనే భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచిన ట్రంప్, ఇప్పుడు దాన్ని ఇంకా పెంచే యోచనలో ఉన్నారు. రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయం ఉక్రెయిన్ యుద్ధానికి ఉపయోగపడుతోందని, భారత్ తక్కువ ధరకే రష్యా నుండి చమురు కొని లాభపడుతోందని ట్రంప్ వాదన. ఈ ఉద్రిక్తతల మధ్య రిలయన్స్ వివరణ ఇవ్వడం గమనార్హం.
అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు కఠినతరం చేయడంతో, రష్యా నుంచి భారత్‌కు వచ్చే చమురు సరఫరా క్రమంగా తగ్గుతోంది. గ్లోబల్ కమోడిటీ ఇంటెలిజెన్స్ సంస్థ కేప్లర్ నివేదిక ప్రకారం.. డిసెంబర్ నెలలో రష్యా చమురు దిగుమతులు మూడేళ్ల కనిష్ట స్థాయికి అంటే రోజుకు 1.2 మిలియన్ బారెళ్లకు పడిపోయాయి. గత జూన్ నెలలో ఇది రోజుకు 2 మిలియన్ బారెళ్లుగా ఉండేది. అంటే దిగుమతుల్లో సుమారు 40 శాతం మేర కోత పడింది. ఆంక్షల భయం వల్ల భారతీయ కంపెనీలు రష్యా చమురుకు దూరంగా ఉంటున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
గత ఏడాది రష్యా ముడి చమురును భారీగా కొనుగోలు చేసిన కంపెనీల్లో రిలయన్స్ అగ్రస్థానంలో ఉంది. అయితే ఇప్పుడు మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రిలయన్స్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో, అమెరికా మార్కెట్‌ను దెబ్బతీసుకోకుండా ఉండేందుకే అంబానీ ఈ క్లారిటీ ఇచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రష్యా చమురు దిగుమతుల విషయంలో భారతీయ కంపెనీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది.

