10 నిమిషాల్లో రూ.25,000 కోట్ల లాభం

Reliance Industries : అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. వెనిజులాపై అమెరికా జరిపిన మెరుపు దాడి ప్రభావం ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి బాగా కలిసొచ్చింది. వెనిజులా చమురు బావులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం ఉదయం రాకెట్‌లా దూసుకెళ్లాయి. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే అంబానీ కంపెనీ ఏకంగా 25 వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది.

సోమవారం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా మారాయి. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం, రిలయన్స్ షేరు 1 శాతం పైగా వృద్ధితో రూ.1611.20 వద్దకు చేరుకుంది. ఇది కంపెనీ చరిత్రలోనే 52 వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. గత శుక్రవారం రూ. 1592 వద్ద ముగిసిన షేరు, వెనిజులా పరిణామాల తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. గత ఏడాది కాలంలోనే ఈ షేరు ఏకంగా 27 శాతం పైగా లాభాలను పంచిపెట్టడం అంబానీ బ్రాండ్ పవర్‌ను చూపిస్తోంది.

షేరు ధర పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. గత వారం ముగిసే సమయానికి రిలయన్స్ వాల్యూయేషన్ రూ.21,54,978 కోట్లుగా ఉండగా, సోమవారం ఉదయం అది రూ.21,80,351 కోట్లకు చేరింది. అంటే కేవలం నిమిషాల వ్యవధిలో కంపెనీ విలువ రూ.25,373 కోట్లు పెరిగింది. వెనిజులా చమురు దిగుమతుల్లో రిలయన్స్ కీలక పాత్ర పోషిస్తుండటం, అక్కడి రాజకీయ మార్పులు భవిష్యత్తులో కంపెనీకి లాభదాయకంగా మారుతాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు షేర్లను కొనేందుకు ఎగబడ్డారు.

కేవలం రిలయన్స్ మాత్రమే కాదు, దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థల షేర్లు కూడా పండగ చేసుకుంటున్నాయి. వెనిజులా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాలో మార్పులు వస్తాయన్న అంచనాలతో ONGC షేర్లు 2.09 శాతం, HPCL షేర్లు 2.56 శాతం లాభపడ్డాయి. అలాగే ఇండియన్ ఆయిల్ (IOCL) 1.19 శాతం, ఆయిల్ ఇండియా 0.72 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం మీద చమురు రంగం సోమవారం స్టాక్ మార్కెట్‌లో హీరోగా నిలిచింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయిల్ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయన్న నమ్మకంతో ట్రేడర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story