Mukesh Ambani : భారతీయ దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ (RIL) ఒక సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు షేర్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న అంబానీ.. తమ టెలికాం, డిజిటల్ మీడియా విభాగమైన జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వెంటనే ముఖేష్ అంబానీ స్టేటస్ మార్కెట్లో సూపర్ కింగ్ స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే లిస్టింగ్ పూర్తి కాగానే దేశంలోనే అత్యంత భారీ మార్కెట్ విలువ కలిగిన రెండవ కంపెనీగా జియో అవతరించబోతోంది.

బీఎస్‌ఈ లో రిలయన్స్ వాటా భారీగా పెంపు

ఈ మెగా ఐపీఓ లిస్టింగ్ తర్వాత, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ గ్రూప్ వాటా ప్రస్తుతమున్న 4 శాతం నుంచి ఏకంగా 7 శాతానికి పెరగనుంది. జియో ప్లాట్‌ఫార్మ్స్ అంచనా వేసిన విలువ ప్రకారం, మార్కెట్ క్యాప్ పరంగా భారతదేశంలోని టాప్ టూ స్థానాలు అంబానీ గ్రూప్ సొంతం కానున్నాయి. మొదటి స్థానంలో రూ.17.7 లక్షల కోట్ల విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండగా.. రెండవ స్థానంలో ఏకంగా రూ.14 లక్షల కోట్ల అంచనా విలువతో జియో ప్లాట్‌ఫార్మ్స్ నిలవనుంది.

దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టేస్తున్న అంబానీ

జియో ప్లాట్‌ఫార్మ్స్ రాకతో మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా నంబర్ 2, 3 స్థానాల్లో కొనసాగుతున్న దేశీయ ఆర్థిక, కమ్యూనికేషన్ దిగ్గజాలు ఒక్కసారిగా కిందకి పడిపోనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ రేసులో మొదటి రెండు స్థానాలు అంబానీ పరమైతే.. ఆ తర్వాతి స్థానాల్లో రూ.12.01 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రూ.11.64 లక్షల కోట్లతో భారతీ ఎయిర్‌టెల్, రూ.9.66 లక్షల కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకులు నిలవనున్నాయి. దేశంలోని టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాప్ వివరాలను ఈ క్రింది పట్టికలో క్లియర్ కట్‌గా చూడవచ్చు.

భారతదేశ టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాప్ (మార్కెట్ విలువ)

1. రిలయన్స్ ఇండస్ట్రీస్ – రూ. 17.72 లక్షల కోట్లు

2. జియో ప్లాట్‌ఫార్మ్స్ (అంచనా) – రూ. 14.00 లక్షల కోట్లు

3. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – రూ. 12.01 లక్షల కోట్లు

4. భారతీ ఎయిర్‌టెల్ – రూ. 11.64 లక్షల కోట్లు

5. ఐసీఐసీఐ బ్యాంక్ – రూ. 9.66 లక్షల కోట్లు

6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – రూ. 9.55 లక్షల కోట్లు

7. టీసీఎస్ (TCS) – రూ. 7.69 లక్షల కోట్లు

8. బజాజ్ ఫైనాన్స్ – రూ. 5.99 లక్షల కోట్లు

9. ఎల్ అండ్ టీ (L&T) – రూ. 5.79 లక్షల కోట్లు

10. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) – రూ. 5.16 లక్షల కోట్లు

రూ. 32 లక్షల కోట్ల భారీ సామ్రాజ్యం

రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫార్మ్స్ ఈ రెండు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కలిపితే దాదాపు రూ.32 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ భారీ విలువ ప్రస్తుతం మార్కెట్లో టాప్ లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్.. ఈ మూడు కంపెనీల మొత్తం సంయుక్త మార్కెట్ విలువకు (రూ. 33 లక్షల కోట్లు) సమానంగా ఉండటం విశేషం. ప్రస్తుతం బీఎస్‌ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.478 లక్షల కోట్లుగా ఉండగా, నిఫ్టీ-50 కంపెనీల విలువ రూ.194 లక్షల కోట్లుగా ఉంది. అంటే బెంచ్‌మార్క్ ఇండెక్స్ మొత్తం వాల్యూలో కేవలం అంబానీ గ్రూప్ కంపెనీల వాటానే 16 శాతం కంటే ఎక్కువగా ఉండబోతోంది.

గ్లోబల్ మార్కెట్లో ఎలన్ మస్క్ రికార్డులతో పోలిక

అంతర్జాతీయ స్థాయి మార్కెట్లతో పోల్చి చూస్తే.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీలు రెండూ కలిసి యూఎస్ మార్కెట్ క్యాప్‌లో కేవలం 5 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. అమెరికా నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్ మార్కెట్ క్యాప్ 2.4 ట్రిలియన్ డాలర్లుగాను, టెస్లా విలువ 1.3 ట్రిలియన్ డాలర్లుగాను ఉంది. అక్కడ మొత్తం యూఎస్ మార్కెట్ విలువ 77 ట్రిలియన్ డాలర్ల పైమాటే. అదేవిధంగా దక్షిణ కొరియాలో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఎస్‌కే హైనిక్స్ కంపెనీలు ఆ దేశ మొత్తం మార్కెట్ క్యాప్‌లో 50 శాతం వాటాను కలిగి ఉండగా, తైవాన్‌లో చిప్ తయారీ దిగ్గజం టీఎస్‌ఎంసీ దేశ మార్కెట్ క్యాప్‌లో 40 శాతం కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అందిస్తోంది. ఇప్పుడు భారత్‌లో కూడా అంబానీ గ్రూప్ అదే రేంజ్ లో దేశీయ మార్కెట్‌ను శాసించబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story