Jio IPO: భారతీయ షేర్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రిలయన్స్ గ్రూప్ శ్రీకారం చుట్టింది. పండుగల వేళ సాధారణ, సంస్థాగత ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించే లక్ష్యంతో జియో ప్లాట్‌ఫార్మ్స్ మెగా ఐపీఓను మార్కెట్లోకి తీసుకురావడానికి ముకేశ్ అంబానీ సర్వం సిద్ధం చేశారు. భారత కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్ దేశంలోనే అతిపెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రారంభించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాబోయే నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఈ మెగా ఐపీఓను మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రికార్డు స్థాయిలో సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.37,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మూలపత్రాలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి స్పష్టమైన అనుమతి లభించింది.

రుణాల భారం నుంచి విముక్తి

ఈ చారిత్రాత్మక ఐపీఓ కోసం త్వరలోనే తుది తేదీలను ఖరారు చేయనున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి విదేశాలలో మూడు వారాలు, దేశీయంగా రెండు వారాల పాటు భారీ ఎత్తున రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన సొమ్ము నుంచి సుమారు రూ. 27,500 కోట్లను జియో ప్లాట్‌ఫార్మ్స్ తన ప్రధాన అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ పాత రుణాలను గడువుకంటే ముందే చెల్లించడానికి వినియోగిస్తుంది. మిగిలిన సొమ్మును సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కేటాయించనుంది. 2006లో వచ్చిన రిలయన్స్ పెట్రోలియం లిస్టింగ్ తర్వాత, గత రెండు దశాబ్దాలలో రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న మొదటి ఐపీఓ ఇది కావడం విశేషం.

దిగ్గజ సంస్థల భాగస్వామ్యం

ప్రస్తుతం జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో గ్లోబల్ టెక్ దిగ్గజాలైన మెటా (9.98%), గూగుల్ (7.73%) లతో పాటు సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, కెకెఆర్, సిల్వర్ లేక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు దాదాపు 30.9 శాతం వాటా ఉంది. ఈ ఆఫర్ భారతీయ షేర్ మార్కెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఐపీఓగా నిలవబోతోంది. ఇదివరకు రికార్డు స్థాయిలో ఉన్న హ్యుందాయ్ మోటార్స్ (రూ. 27,870 కోట్లు), ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు), పేటీఎం (రూ. 18,300 కోట్లు) వంటి భారీ ఇష్యూల రికార్డులను ఇది తిరగరాయనుంది.

270 మిలియన్ల కొత్త షేర్లు

ఈ మెగా ఇష్యూలో భాగంగా జియో ప్లాట్‌ఫార్మ్స్ దాదాపు 270 మిలియన్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని భావిస్తోంది. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో దాదాపు 2.9 శాతానికి సమానం. ప్రాథమిక మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న ఈ ఇష్యూ ద్వారా భారత స్టాక్ మార్కెట్లోకి భారీగా నిధులు ప్రవహించడమే కాకుండా, రిటైల్ ఇన్వెస్టర్లకు సుదీర్ఘ కాలంలో అద్భుతమైన రాబడులు ఇచ్చే పెట్టుబడి అవకాశంగా మారనుంది.

Next Story