ఎలాంటి ఛార్జీలు ఉండవు - క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

UPI Payments : డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ వినియోగదారులకు, వ్యాపారులకు శుభవార్త. పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారన్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అటువంటి ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా యూపీఐ వాడుతున్న కోట్లాది మందికి, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చింది.

రూ. 3,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఒకటి ఉందని కొన్ని వార్తా సంస్థలలో ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పుకార్లకు చెక్ పెడుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ తన 'ఎక్స్' ఖాతా ద్వారా తక్షణమే స్పందించింది.

https://x.com/FinMinIndia/status/1932792661183729866?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1932792661183729866|twgr^5f237610c838ca7271faccc8505633ae28dbe092|twcon^s1_&ref_url=https://tv9kannada.com/business/no-plan-to-impose-mdr-merchant-discount-rate-on-upi-transactions-finance-ministry-clarifies-1037194.html

"యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ రకమైన ఊహాజనిత వార్తలు పౌరులలో అనవసరమైన భయాన్ని, సందేహాలను, అనిశ్చితిని సృష్టిస్తాయి. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ కు సపోర్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఎక్స్ పోస్టులో పేర్కొంది. ఈ స్పష్టతతో యూపీఐ భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయాయి.

ఏమిటీ ఎండీఆర్ ?

మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) అనేది క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్స్ ప్రాసెసింగ్ సంస్థలు వ్యాపారుల నుండి వసూలు చేసే రుసుం. లావాదేవీల నిర్వహణకు అయ్యే ఖర్చులను భరించడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఎండీఆర్ వసూలు చేస్తారు. యూపీఐ ప్రారంభమైనప్పటి నుండి, దానిపై కూడా ఎండీఆర్ విధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. అయితే, యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం ఇప్పటివరకు ఎండీఆర్ ను నిరాకరిస్తూ వచ్చింది.

యూపీఐ వినియోగం సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 63.9 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపుల ప్రాసెసింగ్ సంస్థ అయిన వీసా కంటే కూడా ఎక్కువ లావాదేవీలను నిర్వహించింది. ఇంత పెద్ద ఎత్తున జరిగే చెల్లింపులను నిర్వహించడానికి ఏటా దాదాపు రూ. 10,000 కోట్ల వరకు ఖర్చు అవుతోందని చెల్లింపుల పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భారీ నిర్వహణ వ్యయాన్ని భరించడానికి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని అవి ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై 0.75 శాతం నుండి 2 శాతం వరకు ఎండీఆర్ వసూలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలకు కనీసం 0.3 శాతం ఎండీఆర్ విధించడానికి అనుమతించాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ డిమాండ్లను మన్నించి, యూపీఐపై ఎండీఆర్ విధించే నిర్ణయం తీసుకుందని గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ఈ వార్తలను పూర్తిగా ఖండించి, యూపీఐ వినియోగదారులకు, వ్యాపారులకు ఊరట కల్పించింది.

Updated On 12 Jun 2025 11:58 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story