Vodafone Idea: పన్ను రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఆదాయపు పన్ను శాఖ అనుసరిస్తున్న తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఐటీ శాఖ పనిచేసే విధానం చాలా నిరాశాజనకమైన చిత్రాన్ని చూపుతోందని వ్యాఖ్యానించిన కోర్టు, ప్రముఖ టెలికామ్ కంపెనీ వోడాఫోన్ ఐడియాకు రావలసిన రూ.53.09 కోట్ల రీఫండ్ సొమ్మును చట్టబద్ధమైన వడ్డీతో కలిపి వెంటనే విడుదల చేయాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించింది. జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ రజనీష్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సెప్టెంబర్ 30 లోగా చెల్లించకుంటే అదనపు పెనాల్టీ

కోర్టు తన ఉత్తర్వుల్లో సెప్టెంబర్ 30, 2026 నాటికి ఈ మొత్తం సొమ్ము కంపెనీ ఖాతాలో జమ కావాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ సొమ్మును చెల్లించకపోతే, సాధారణ చట్టబద్ధమైన వడ్డీతో పాటు నెలకు 1 శాతం అదనపు వడ్డీని పెనాల్టీగా ఐటీ శాఖ చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.

అసలేంటీ వివాదం?

ఈ కేసు అసెస్మెంట్ ఇయర్స్ 2003-04 నుంచి 2013-14 మధ్య కాలానికి చెందిన పన్ను రీఫండ్‌కు సంబంధించింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ఇన్కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)లో సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన తర్వాత ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో ట్రిబ్యునల్ వోడాఫోన్ ఐడియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగా అస్సెస్సింగ్ ఆఫీసర్ రీఫండ్ మొత్తాన్ని రూ.53.09 కోట్లుగా నిర్ధారించారు. కానీ ఐటీ శాఖ ఫారమ్ 26B సమర్పించాలని సాకు చెబుతూ రీఫండ్‌ను ఆపేసింది. అంతేకాకుండా కంపెనీకి రూ.924.57 కోట్ల పాత బకాయిలు ఉన్నాయని నిలిపివేసింది. అయితే ఇందులో రూ.913.66 కోట్ల రికవరీపై ఇప్పటికే వివిధ కోర్టుల స్టే ఉందన్న విషయాన్ని ఐటీ శాఖ ఒప్పుకుంది.

పన్ను చెల్లింపుదారులకు దక్కిన విజయం

అప్పీలేట్ అథారిటీ నుంచి రీఫండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత అది పన్ను చెల్లింపుదారుడి హక్కుగా మారుతుందని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 245 కింద చట్టబద్ధమైన ప్రాసెస్ మరియు ఉత్తర్వులు లేకుండా రీఫండ్ మొత్తాన్ని నిలిపివేయడం లేదా వేరే బాకీలకు అడ్జస్ట్ చేయడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఏకేఎమ్ గ్లోబల్ వంటి పన్ను సలహా సంస్థల నిపుణులు ఈ తీర్పును స్వాగతించారు. అనవసరమైన పరిపాలనా నియమాల పేరుతో రీఫండ్లను నిలిపివేసే ఐటీ శాఖ ధోరణికి ఈ తీర్పు చెక్ పెడుతుందని, పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట నిస్తుందని విశ్లేషించారు.

Next Story