Retail Inflation : సామాన్యుడిపై ధరల భారం.. వరుసగా 6వ నెల పెరిగిన ద్రవ్యోల్బణం
వరుసగా 6వ నెల పెరిగిన ద్రవ్యోల్బణం

Retail Inflation : నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై ధరల భారం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 3.48 శాతానికి చేరుకుంది. మార్చిలో ఇది 3.40 శాతంగా ఉండగా, ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. గత ఏడాది అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం వరుసగా ఆరో నెల కూడా పెరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఆరు నెలలుగా ఆగని పెరుగుదల
గణాంకాలను పరిశీలిస్తే, అక్టోబర్ 2025లో ద్రవ్యోల్బణం కేవలం 0.25 శాతంగా ఉండేది. కానీ అక్కడి నుంచి మెల్లిగా పెరుగుతూ నవంబర్‌లో 0.71 శాతానికి, డిసెంబర్‌లో 1.33 శాతానికి చేరింది. 2026 జనవరి నాటికి 2.74 శాతానికి ఎగబాకగా, ఫిబ్రవరిలో 3.21 శాతానికి చేరుకుంది. గత మూడు నెలలుగా ఇది 3 శాతానికి పైనే కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం పరిమితి కంటే ఇది తక్కువగానే ఉన్నప్పటికీ, పెరుగుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రామాల్లోనే ధరల మంట ఎక్కువ
రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ప్రధాన కారణం. ఏప్రిల్ 2026 నాటికి వినియోగదారుల ఆహార ధరల సూచిక 4.20 శాతంగా నమోదైంది. ఆశ్చర్యకరంగా పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణాల్లో ఆహార ద్రవ్యోల్బణం 4.10 శాతంగా ఉంటే, గ్రామాల్లో అది 4.26 శాతంగా ఉంది. అంటే సామాన్య ప్రజలు, రైతులు నివసించే గ్రామాల్లో తిండి గింజల ధరలు పట్టణాల కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట.
దక్షిణాదిపై చుక్కలు చూపిస్తున్న ధరలు
దేశం మొత్తం మీద చూస్తే దక్షిణాది రాష్ట్రాలపై ధరల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.81 శాతానికి చేరి దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 6 శాతం దాటేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. అక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం 4.20 శాతంగా ఉండగా, ఆహార ద్రవ్యోల్బణం 5.43 శాతంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆహార పదార్థాల ధరలు 5 నుండి 6 శాతం మధ్యలో మండుతున్నాయి. రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
మున్ముందు ఇంకా పెరిగే ప్రమాదం
అంతర్జాతీయంగా, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే రానున్న నెలల్లో సామాన్యుడి జేబుకు మరిన్ని చిల్లులు పడటం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

