UPI : యూపీఐ పేమెంట్స్‌లో విప్లవం.. AI, IoTతో ఆర్బీఐ కొత్త నాలుగు టూల్స్
AI, IoTతో ఆర్బీఐ కొత్త నాలుగు టూల్స్

UPI : డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని మరింత మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక కీలక ముందడుగు వేశారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2025 వేదికగా, యూపీఐ పేమెంట్స్ మరింత స్మార్ట్‌గా, సులభంగా మార్చే లక్ష్యంతో నాలుగు కొత్త డిజిటల్ ఇనిషియేటివ్‌లను ఆవిష్కరించారు. ఈ కొత్త టూల్స్‌తో కేవలం కొన్ని క్లిక్‌లలోనే పేమెంట్స్ చేయవచ్చు. అంతేకాకుండా ఇకపై మొబైల్ ఫోన్‌లే కాకుండా, కార్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఇతర కనెక్టెడ్ పరికరాల ద్వారా కూడా పేమెంట్లు చేసే అవకాశం లభిస్తుంది. ఆ నాలుగు సరికొత్త ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
కొత్తగా వచ్చిన నాలుగు UPI ఫీచర్లు
1. AI-బెస్డ్ UPI HELP
యూపీఐ లావాదేవీలలో ఎదురయ్యే సమస్యలకు, మాండేట్ నిర్వహణకు, ఫిర్యాదుల పరిష్కారానికి సహాయం చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్‌ను ఆర్బీఐ స్వయంగా అభివృద్ధి చేసింది. దీని సహాయంతో వినియోగదారులు తమ ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు, ఫిర్యాదులను నమోదు చేయవచ్చు లేదా వాటి స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇది యూజర్‌కు సమస్య పరిష్కారానికి స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నా, త్వరలోనే హిందీ, ఇతర భారతీయ భాషల్లో కూడా తీసుకురానున్నారు. దీనివల్ల బ్యాంకులు కూడా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి వీలవుతుంది.
2. IoT పేమెంట్స్
IoT (Internet of Things) టెక్నాలజీ ద్వారా డిజిటల్ పేమెంట్స్ కనెక్ట్ చేయడం. ఇకపై పెట్రోల్ కొట్టడానికి లేదా ఈవీ ఛార్జింగ్ కోసం ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. మీ కనెక్టెడ్ కార్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ గ్లాసెస్ లేదా స్మార్ట్ టీవీ వంటి పరికరాల నుంచే నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ఇది ఎటువంటి అడ్డంకులు లేని, స్మూత్ పేమెంట్ ఎక్సపీరియన్స్ అందిస్తుంది. భవిష్యత్తులో స్మార్ట్ పేమెంట్స్ దిశగా ఇది ఒక అతిపెద్ద ముందడుగు.
3. బ్యాంకింగ్ కనెక్ట్
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడం. దీనిని NPCI భారత్ బిల్ పే లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది ఆర్బీఐ పేమెంట్స్ విజన్ 2025 లక్ష్యమైన అందరి కోసం, అన్ని చోట్లా, అన్ని వేళలా ఇ-చెల్లింపులుకు అనుగుణంగా ఉంది. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, మర్చంట్ల మధ్య సెటిల్‌మెంట్, సమస్యల పరిష్కారం మరింత సులభంగా, వేగంగా జరుగుతుంది. యూజర్‌లు QR కోడ్ స్కాన్ చేసి చెల్లించడం, Pay via App వంటి మొబైల్-ఫస్ట్ ఫీచర్లను ఈజీగా పొందగలుగుతారు.
4. యూపీఐ రిజర్వ్ పే
తరచుగా ఆన్‌లైన్ చెల్లింపులు చేసే వారికి (ఉదా: ఈ-కామర్స్, ఫుడ్ ఆర్డర్లు, క్యాబ్ బుకింగ్‌లు) ఈజీగా పేమెంట్స్ చేసే అవకాశం కల్పించడం. ప్రతిసారీ కార్డు వివరాలు లేదా OTP ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ ద్వారా యూజర్‌లు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ లేదా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌లోని కొంత మొత్తాన్ని బ్లాక్ చేసి, దాన్ని నిర్దిష్ట కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు. యూజర్‌లు తమ బ్లాక్ చేసిన లేదా ఉపయోగించిన క్రెడిట్ వివరాలను అన్ని పెద్ద యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో ఒకే చోట సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఈ నాలుగు ఇనిషియేటివ్‌లు భారతదేశ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్తున్నాయి. భవిష్యత్తులో ప్రతి చెల్లింపు సులభంగా, వేగంగా, సురక్షితంగా మారుతుందని చెప్పవచ్చు.
