Richest CMs : రూ.1400 కోట్లతో టాప్‌లో కర్ణాటక సీఎం.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రులు వీరే
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రులు వీరే

Richest CMs : భారతదేశ రాజకీయాల్లో నాయకుల ఆస్తులు, వారి సంపాదన ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నిలుస్తాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఆస్తులపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు వందల కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుల జాబితాలో కొనసాగుతున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడుల ద్వారా వీరి సంపద భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
రూ.1400 కోట్లతో టాప్ ప్లేస్‌లో డీకే శివకుమార్
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్ నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అధికారిక అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.1400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఆయనకున్న భూములు, లగ్జరీ ఇళ్లు, వివిధ వ్యాపారాల ద్వారా ఈ స్థాయి సంపద సమకూరినట్లు సమాచారం. దేశంలోని ఏ ఇతర ముఖ్యమంత్రికి కూడా ఈ స్థాయిలో ఆస్తులు లేకపోవడం విశేషం.
రెండో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు నాయుడి మొత్తం ప్రకటించిన ఆస్తుల విలువ దాదాపు రూ.931 కోట్లుగా ఉంది. హెరిటేజ్ సంస్థతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, షేర్లు, ఇతర స్థిరాస్తుల రూపంలో ఆయనకు ఈ భారీ సంపద ఉంది. వీరి ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
సినిమా సంపాదనతో రేసులోకి వచ్చిన జోసెఫ్ విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.603 కోట్లుగా నమోదైంది. రాజకీయాల్లోకి రాకముందు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగిన విజయ్.. సినిమాల ద్వారానే ఈ భారీ సంపదను ఆర్జించారు. కరెంట్ పాలిటిక్స్‌లో ఒక సినిమా స్టార్ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులతో సీఎం రేసులో నిలవడం సంచలనంగా మారింది.
వందల కోట్ల క్లబ్‌లో పేమా ఖండూ
ఈ ధనవంతుల రేసులో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అఫిడవిట్ వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.332 కోట్లు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అత్యంత ధనవంతుడిగా పెమా ఖండూకు మంచి పేరుంది. ఆయన కుటుంబానికి ఉన్న పాత వ్యాపారాలు, హోటళ్లు, పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడుల వల్లే ఈ ఆస్తులు సమకూరినట్లు తెలుస్తోంది.
రూ. 40 కోట్ల క్లబ్‌లో నెఫియు రియో, మోహన్ యాదవ్
మరోవైపు నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫియు రియో కూడా దేశంలోని ధనిక సీఎంల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ దాదాపు రూ. 46.95 కోట్లు. ఆయన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేరు వినిపిస్తోంది. మోహన్ యాదవ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ. 42 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు మరియు వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి.
అఫిడవిట్లతోనే అసలు విషయాలు బహిర్గతం
భారతదేశంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు కేవలం ఎన్నికల సమయంలో వారు సమర్పించే అఫిడవిట్లు ద్వారానే సామాన్య ప్రజలకు తెలుస్తాయి. ఈ పత్రాలలో నేతలకు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం, లగ్జరీ కార్లు, ఇళ్లు, భూములు, అప్పుల వివరాలన్నింటినీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ దేశంలోనే అత్యంత ధనవంతులైన నాయకులు ఎవరు అనే ఆసక్తికరమైన చర్చలు మార్కెట్ లో మొదలవుతుంటాయి.

