Billionaires: నెలలో ఏకంగా $202 బిలియన్ల సంపద..ప్రపంచంలోనే మళ్లీ ధనవంతుడిగా ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్

Billionaires: ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ ధనవంతుల జాబితా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 892 బిలియన్ డాలర్ల సంపదతో తన మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఆగస్టు నెలలోనే మస్క్ ఏకంగా 202 బిలియన్ డాలర్ల భారీ లాభాన్ని గడించడం విశేషం. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సంపద సరికొత్త శిఖరాలను తాకుతోంది. స్పేస్ ఎక్స్ షేర్లు 33 శాతం, టెస్లా షేర్లు 18 శాతం చొప్పున పెరగడంతో మస్క్ ఖాతాలో ఒక్క నెలలోనే కొండంత సంపద వచ్చి చేరింది. ఈ ఏడాది జూన్‌లోనే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన మస్క్, ఇప్పుడు 892 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మిగిలిన వ్యాపారవేత్తలు ఎవరూ కూడా అతడి దరిదాపుల్లోకి రాలేకపోవడం మస్క్ వ్యాపార సామ్రాజ్య తీవ్రతను తెలియజేస్తోంది.
గూగుల్ అధిపతులకు కోలుకోలేని దెబ్బ
మరోవైపు గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తీవ్ర నష్టాలను చవిచూశాడు. ఆగస్టు నెలలో లారీ పేజ్ సంపద నుంచి 15 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ప్రస్తుతం 277 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, అత్యధిక నష్టం మూటగట్టుకున్న కుబేరుడిగా నిలిచాడు. అతడి భాగస్వామి సెర్గీ బ్రిన్ కూడా 13 బిలియన్ డాలర్లు కోల్పోయి 256 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 10 బిలియన్ డాలర్లు కోల్పోయినప్పటికీ 268 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
రేసులో దూసుకొచ్చిన లారీ ఎల్లిసన్.. జుకర్ బర్గ్ సత్తా
ఒరాకిల్ కో-ఫౌండర్ లారీ ఎల్లిసన్ గత నెలలో 25 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించి ఎనిమిదో స్థానం నుంచి నేరుగా ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇతడి మొత్తం సంపద 193 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 17 బిలియన్ డాలర్లు గడించినప్పటికీ, ఎల్లిసన్ జోరు కారణంగా ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 197 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలవగా, డెల్ టెక్నాలజీస్ అధినేత మైఖేల్ డెల్ 241 బిలియన్ డాలర్లతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
టాప్ 10 జాబితాలోకి కొత్త వ్యక్తుల ఎంట్రీ
ఈసారి ఫోర్బ్స్ జాబితా చివరి స్థానాల్లో సంచలన మార్పులు నమోదయ్యాయి. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ 10 బిలియన్ డాలర్ల లాభంతో 11వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకున్నాడు. ఇతడి నెట్‌వర్త్ 155 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్ జారా మాతృ సంస్థ ఇండిటెక్స్ కో-ఫౌండర్ అమన్సియో ఓర్టెగా ఏకంగా దిగ్గజ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను జాబితా నుంచి నెట్టివేసి 10వ స్థానంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన ఓర్టెగా సంపద 148 బిలియన్ డాలర్లకు చేరింది.

