T20 World Cup 2026 : సూర్య సేన చరిత్ర సృష్టిస్తుందా? టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సూపర్-8 రౌండ్‌లో అత్యంత కీలకమైన, ఆఖరి సమరంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుని సెమీస్ కు దూసుకెళ్లింది. ఓడిన వెస్టిండీస్ జట్టు ఇంటిదారి పట్టింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. భారత జట్టుకు ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఇది చరిత్ర సృష్టించే సువర్ణావకాశం. 2024లో టీమ్ ఇండియా పొట్టి ప్రపంచకప్‌ను గెలిచిన తీరును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు టైటిల్ గెలవలేదు. ఒకవేళ నేడు విండీస్‌ను ఓడించి, సెమీస్ దాటి భారత్ కప్పు కొడితే.. వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి జట్టుగా టీమిండియా రికార్డులకెక్కుతుంది. సూర్య సేన ఈ అరుదైన ఘనతను అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు సెమీఫైనల్ బెర్తులు ఇప్పటికే దాదాపు ఖరారయ్యాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇండియా జట్లు ఇప్పటికే తమ అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు అర్హత సాధించాయి. ఫైనల్ సూపర్ 8 మ్యాచ్ ఫలితం రాగానే సెమీఫైనల్ షెడ్యూల్, ఏ జట్టు ఎవరితో తలపడాలి అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. ఫైనల్ చేరడానికి జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, ఈసారి ప్రైజ్ మనీ కూడా భారీ స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మీడియా నివేదికల ప్రకారం, టీ20 ప్రపంచకప్ 2026 కోసం మొత్తం రూ.120.37 కోట్ల రూపాయల (13.5 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీని కేటాయించారు. విజేతగా నిలిచే జట్టుకు ఏకంగా రూ.27.48 కోట్లు దక్కనున్నాయి. 2024లో భారత్ గెలిచినప్పుడు వచ్చిన రూ.20 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. రన్నరప్ (రెండు స్థానంలో నిలిచిన జట్టు) కు రూ.14.65 కోట్లు లభిస్తాయి. సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు రూ.7.24 కోట్లు, మిగిలిన స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా కోట్ల రూపాయల నగదు బహుమతులు అందనున్నాయి.

