రూ.2,929 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు

Anil Ambani : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇటీవలే సెబీ ఆయన యెస్ బ్యాంక్ కేసు విచారణను నిలిపివేయాలన్న అప్పీల్‌ను తిరస్కరించింది. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీ, ఆయన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom)పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ, ఆయన కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు సుమారు రూ.2,929 కోట్ల నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు సీబీఐ ఆగస్టు 21న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నమోదైంది. అంతకుముందు సీబీఐ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీపై రూ.2,929 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసును నమోదు చేసింది. ఆగస్టు 23న సీబీఐ ముంబైలోని అనిల్ అంబానీ కార్యాలయాలు, ఆయన నివాసంపై దాడులు కూడా నిర్వహించింది.

ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అనిల్ అంబానీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన తనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ కేసులో కావాలనే తనను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ ఆరోపణలు దాదాపు పది సంవత్సరాల క్రితం నాటివని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నానని, కంపెనీ రోజువారీ వ్యవహారాల్లో తనకు ఎలాంటి ప్రత్యక్ష పాత్ర లేదని ఆయన ప్రతినిధి చెప్పారు. సీబీఐ చర్య తర్వాత, ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసును దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది.

ఇప్పటికే ఈడీ అనిల్ అంబానీ, ఆయన కంపెనీలపై మూడు వేర్వేరు కేసులలో బ్యాంక్ మోసాలకు సంబంధించిన విచారణ జరిపింది. ఆగస్టు 18న వచ్చిన మీడియా రిపోర్టుల ప్రకారం రూ.17,000 కోట్ల బ్యాంక్ లోన్ స్కామ్ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సీనియర్ అధికారులను ఈడీ ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ 20కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు లేఖలు రాసి, రిలయన్స్ గ్రూప్‌కు ఇచ్చిన అప్పుల వివరాలు, వాటి క్రెడిట్ చెక్ సమాచారాన్ని కోరింది.

ఈ కేసులో భాగంగా ఈడీ అనిల్ అంబానీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన అమితాబ్ ఝున్‌ఝున్‌వాలాను కూడా మంగళవారం ప్రశ్నించింది. ఈ దర్యాప్తులో ఆయన గతంలో కూడా ఈడీ ముందు హాజరయ్యారు. ఒక ఫారెన్సిక్ ఆడిటర్ నివేదిక ద్వారా ఈ బ్యాంక్ మోసం బయటపడిందని, దీనిపై ఎస్బీఐ ముంబై బ్రాంచ్ డీజీఎం జ్యోతి కుమార్ ఆగస్టు 18న ఈడీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైందని వర్గాలు తెలిపాయి. ఈ నివేదిక అక్టోబర్ 2020లో వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story