Rs.500 Notes : మార్చి నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్లు కనిపించవా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?
వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

Rs.500 Notes : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 500 రూపాయల నోట్ల గురించి ఒక వింత ప్రచారం జరుగుతోంది. 2026 మార్చి నుంచి ఏటీఎంలలో 500 నోట్లు రావు అని, అసలు ఆ నోట్లనే ప్రభుత్వం రద్దు చేస్తోందని వస్తున్న వార్తలు సామాన్య ప్రజలను కలవరపెడుతున్నాయి. పాత నోట్ల రద్దు చేదు జ్ఞాపకాలు ఉన్న జనాలకు ఈ వార్త వినగానే ఒక్కసారిగా గుండె జారినంత పని అయింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? ప్రభుత్వం నిజంగానే 500 నోట్లకు మంగళం పాడుతోందా? అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం.
గతేడాది ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు, మార్కెట్‌లో చిన్న నోట్ల లభ్యతను పెంచాలని బ్యాంకులకు సూచించింది. ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు ఎక్కువగా ఉండేలా చూడాలని చెప్పింది. దీని ఉద్దేశ్యం సామాన్యులకు చిల్లర కష్టాలు కలగకూడదనే. కానీ, కొందరు దీన్ని వక్రీకరించి.. 500 నోట్లను ఏటీఎంల నుంచి తొలగిస్తున్నారని, త్వరలోనే వీటిని రద్దు చేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవి చూసిన చాలామంది నిజమేనని నమ్మి షేర్ చేయడంతో ఈ రూమర్ దావాగ్నిలా వ్యాపించింది.
ఈ వైరల్ వార్తలపై ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థ PIB రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని, అందులో ఇసుమంతైనా నిజం లేదని తేల్చి చెప్పింది. 500 రూపాయల నోట్లను ఏటీఎంల నుంచి తొలగించే ఉద్దేశం గానీ, వాటిని రద్దు చేసే ఆలోచన గానీ కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఆర్బీఐ కూడా ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది.
500 రూపాయల నోటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని, లావాదేవీలకు దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించింది. ఏదైనా సమాచారం తెలిసినప్పుడు ముందుగా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించింది. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి అబద్ధపు వార్తలు వచ్చాయని, వాటిని ప్రతిసారీ ప్రభుత్వం ఖండించిందని గుర్తు చేసింది.

