Crypto Scam: భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో రూ.623 కోట్ల భారీ మోసం.. ప్రభుత్వ నిఘాలో 27 కంపెనీలు
ప్రభుత్వ నిఘాలో 27 కంపెనీలు

Crypto Scam: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేరగాళ్లు చట్టవిరుద్ధమైన డబ్బును మార్చుకోవడానికి (మనీ లాండ్రింగ్) కొత్త దారి పడుతున్నారు..అదే క్రిప్టోకరెన్సీ. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే I4C (ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్) విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని బయటపెట్టింది. దేశీయ, విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలు సైబర్ నేరగాళ్లకు దొంగిలించిన డబ్బును డిజిటల్ ఆస్తులుగా మార్చుకుని, ప్రపంచవ్యాప్తంగా తరలించడానికి పెద్ద మార్గంగా మారాయని ఈ డేటా స్పష్టం చేస్తోంది.
గత 21 నెలల్లో (జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు) కనీసం 27 భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలను ఉపయోగించి సుమారు రూ.623.63 కోట్ల మేర మోసాలు జరిగాయి. ఈ మోసాల్లో చిక్కుకున్న అమాయక ప్రజల సంఖ్య 2,872 వరకు ఉంది. మీరు కూడా క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తుంటే, మీ పెట్టుబడి భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ మోసాల వెనుక ఉన్న కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. నేరగాళ్లు నకిలీ ట్రేడింగ్, పెట్టుబడి యాప్‌లను సృష్టిస్తారు. అమాయక పెట్టుబడిదారులను ఆకర్షించి, వారి ద్వారా డబ్బులు కట్టించుకుంటారు. ఆ డబ్బు తమ అకౌంట్‌లలో పడగానే, దాన్ని క్షణాల్లో క్రిప్టోకరెన్సీగా మార్చేస్తారు.
ఆ తర్వాత ఆ క్రిప్టోను అనేక డిజిటల్ వాలెట్‌ల ద్వారా చుట్టూ తిప్పుతారు. దీనివల్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి పోయిందో కనిపెట్టడం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు దాదాపు అసాధ్యం అవుతుంది. అధికారులు చెబుతున్న లెక్క ఇది కొంచెమేనని ఈ నెట్‌వర్క్ ఇంకా పెద్దదిగా ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ మోసాలతో పాటు విదేశీ క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కూడా 769 మంది నుంచి రూ.25 కోట్లకు పైగా మోసం జరిగింది. ఈ మొత్తం మోసాలపై దృష్టి సారించిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ సంస్థ, ఈ 27 భారతీయ ఎక్స్ఛేంజీల జాబితాను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, దేశ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అందించింది.
నిఘాలో ఉన్న ప్రముఖ భారతీయ ఎక్స్ఛేంజీలు.. CoinDCX, WazirX, Giottus, Zebpay, Mudrex, CoinSwitch మొదలైన పెద్ద పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ ఎక్స్ఛేంజీల విషయానికి వస్తే Binance, Crypto.com, Bybit లాంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లు కూడా రాడార్లో ఉన్నాయి.
తాము కేవలం చట్టబద్ధమైన ట్రేడింగ్‌కు మాత్రమే సదుపాయం కల్పిస్తామని, ఈ నేరాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని ఎక్స్ఛేంజీలు తమ వివరణ ఇచ్చాయి. కఠినమైన KYC, AML(యాంటీ మనీ లాండ్రింగ్) నియమాలు ఉన్నప్పటికీ, నేరగాళ్లు P2P (పీర్-టు-పీర్) ఛానెళ్లు లేదా బయటి వాలెట్‌లను అడ్డు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. భారతదేశంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి స్పష్టమైన చట్టాలు, నిబంధనలు లేకపోవడమే ఈ మోసాలు పెరగడానికి ప్రధాన కారణం. ప్రభుత్వం చట్టం చేస్తే, క్రిప్టోకు ఒక రకంగా అధికారిక అనుమతి ఇచ్చినట్టు అవుతుంది. దీనివల్ల ఎక్కువ మంది ఈ అస్థిరమైన ఆస్తుల్లో డబ్బు పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రిప్టోపై ఒక డిస్కషన్ పేపర్ రెడీ చేస్తోంది. కానీ ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రభుత్వం నుంచి పటిష్టమైన నియమాలు వచ్చే వరకు క్రిప్టోలో పెట్టుబడి పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నకిలీ పెట్టుబడి యాప్‌లు లేదా ఆకర్షణీయమైన ఆఫర్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

