Rupee : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ దశాబ్ద కాలంలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 40 దేశాల కరెన్సీలతో పోల్చి చూసే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (REER) 92.72 కు పడిపోయింది. గతంలో ఇది సగటున 98.25 స్థాయిలో ఉండేది. ఒక దశాబ్దం కాలంలో రూపాయి విలువ ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో భారతదేశం నుంచి విదేశీ మారకద్రవ్యం భారీగా బయటకు వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం.

చమురు సెగ - ఇన్వెస్టర్ల భయం

ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడవచ్చన్న భయంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీనివల్ల మన దిగుమతి ఖర్చులు పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, యుద్ధం వస్తుందన్న భయంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత షేర్ మార్కెట్ నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి విలువ దాదాపు 4.5 శాతం మేర క్షీణించింది. మార్చి చివరి నాటికి డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.21 కి చేరుకోవడం గమనార్హం.

ఎగుమతులకు లాభం.. దిగుమతులకు భారం

రూపాయి విలువ తగ్గడం వల్ల ఒక చిన్న వెసులుబాటు కూడా ఉంది. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే ఎగుమతులు చౌకగా మారి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీని ఇస్తాయి. అయితే, మనం విదేశాల నుంచి కొనుగోలు చేసే ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు దినుసుల ధరలు భారీగా పెరుగుతాయి. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై ధరల భారం పడుతుంది. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలతో మనకున్న వాణిజ్య సంబంధాలపై కూడా ఈ ప్రభావం పడనుంది.

మున్ముందు పరిస్థితి ఏంటి?

ప్రస్తుతానికి రూపాయి విలువ త్వరగా కోలుకునే సూచనలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాలర్ కు డిమాండ్ పెరగడం, చమురు దిగుమతుల భారం కొనసాగడం వల్ల రూపాయి మరికొంత కాలం ఒత్తిడిలోనే ఉండవచ్చు. ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను ఉపయోగించి రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రపంచ రాజకీయ పరిణామాలు అనుకూలిస్తేనే మన కరెన్సీ నిలదొక్కుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story