Indian Rupee : డాలర్ దెబ్బకు విలవిలలాడుతున్న రూపాయి.. చరిత్రలోనే కనిష్టానికి పతనం
చరిత్రలోనే కనిష్టానికి పతనం

Indian Rupee : ఫారెక్స్‌లో రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో దేశ ఆర్థిక వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మంగళవారం నాడు చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి అయిన 96.52 (తాత్కాలికం) వద్ద ముగిసింది. ట్రేడింగ్ జరుగుతున్న సమయంలో ఒక దశలో ఇది ఏకంగా 96.60 స్థాయికి పడిపోయి మార్కెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. సోమవారం నాటి రికార్డు పతనం (96.20) కంటే ఇది మరో 32 పైసలు దిగజారడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, గ్లోబల్ టెన్షన్స్ కారణంగా డాలర్ ఇండెక్స్ 99.24 వద్ద బలంగా కొనసాగుతుండటమే రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
తాజా పతనంతో 2026 లో ఆసియా ఖండంలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన కరెన్సీగా భారత రూపాయి నిలిచింది. ఈ ఒక్క నెలలోనే రూపాయి విలువ 1.5 శాతం, కాగా ఈ ఏడాది మొత్తంలో ఏకంగా 7 శాతానికి పైగా క్షీణించింది. ఇరాన్ చుట్టూ నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు రూపాయిని మరింత బలహీనపరిచాయి. రూపాయి ఈ రేంజ్‌లో పడిపోవడం వల్ల విదేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులు ముఖ్యంగా ముడి చమురు బిల్లు విపరీతంగా పెరిగిపోనుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
కమోడిటీ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో రూపాయి ఒడిదుడుకుల మధ్య 96 నుంచి 96.60 పరిధిలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగి జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 109.95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాల అభ్యర్థన మేరకు తాము ఇరాన్‌పై కొత్త దాడులను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఇరాన్‌తో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి, సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు పడిపోయాయి.

