ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో రూపాయి కుదేలు

Rupee vs Dollar : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత కరెన్సీ రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, ముడిచమురు ధరలు భగ్గుమనడంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి ఘోరంగా దెబ్బతిన్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 21 పైసలు క్షీణించి 91.29 వద్ద ఆల్-టైమ్ లో లెవల్‌కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. రాబోయే రోజుల్లో రూపాయి విలువ 92 మార్కును కూడా దాటిపోవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూపాయి పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలే. భారత్ తన చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువవుతుండటంతో, మన దేశం చెల్లించాల్సిన ఇంపోర్ట్ బిల్లు తడిసి మోపెడవుతోంది. ఇది నేరుగా కరెన్సీ విలువపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు అమెరికన్ డాలర్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగి 97.78 వద్ద బలంగా ఉండటం వల్ల మిగతా దేశాల కరెన్సీలతో పాటు రూపాయి కూడా బలహీనపడింది.

మరోవైపు, భారత స్టాక్ మార్కెట్లలో సోమవారం చోటుచేసుకున్న భారీ పతనం కూడా రూపాయిని ముంచేసింది. సెన్సెక్స్ 2700 పాయింట్లకు పైగా కుప్పకూలడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కేవలం ఒక్క రోజులోనే రూ.7,536 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను డాలర్ల రూపంలో వెనక్కి తీసుకువెళుతుండటంతో రూపాయికి డిమాండ్ తగ్గి, విలువ క్షీణిస్తోంది. మన దేశ విదేశీ మారక నిల్వలు కూడా గత వారంతో పోలిస్తే 2.119 బిలియన్ డాలర్లు తగ్గి 723.608 బిలియన్ డాలర్లకు పడిపోవడం గమనార్హం.

యుద్ధం వల్ల ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌లోని బాలిస్టిక్ మిసైల్ సైట్లపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పెంచడం, ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరేలా ఉంది. ఒకవేళ చమురు సరఫరా మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే, క్రూడ్ ధరలు ఆకాశాన్నంటుతాయి. అదే జరిగితే రూపాయి విలువ మరిన్ని రికార్డు కనిష్టాలను చూడాల్సి వస్తుంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ముడి పదార్థాల ధరలు భారమవడానికి దారితీస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story