చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్టానికి భారత కరెన్సీ

USD vs INR : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు భారత కరెన్సీని పాతాళానికి తొక్కుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చమురు క్షేత్రాలపై దాడులు జరగడంతో గురువారం ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ కకావికలమైంది. ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 92.3575 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయి రికార్డు సృష్టించింది. అయితే, చివరి నిమిషంలో చమురు ధరలు స్వల్పంగా తగ్గడంతో రూపాయి కాస్త కోలుకుని 92.19 వద్ద ముగిసింది. అయినప్పటికీ, గత సెషన్‌తో పోలిస్తే ఇది 0.16% నష్టంగానే నమోదైంది.

రూపాయి ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్‌కు 101.6 డాలర్లకు చేరింది. భారతదేశం తన అవసరాల కోసం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, చమురు ధరలు పెరిగితే మన రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1% కంటే ఎక్కువగానే పతనమవ్వడం గమనార్హం.

ఈ పరిణామాల ప్రభావం కేవలం కరెన్సీ మార్కెట్‌కే పరిమితం కాలేదు. గ్లోబల్ షేర్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు 1% మేర నష్టపోగా, భారత స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 50 కూడా అదే స్థాయిలో పతనమైంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగి, చమురు ధరలు 100 డాలర్ల పైనే ఉంటే, భారతదేశ ఆర్థిక వృద్ధి కుంటుపడటమే కాకుండా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఎన్‌జెడ్ బ్యాంక్ విశ్లేషకుల ప్రకారం.. చమురు ధరలు సగటున 80 డాలర్ల పైన ఉంటేనే మన కరెంట్ అకౌంట్ లోటును భరించడం కష్టమవుతుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత రిజర్వ్ బ్యాంక్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. రూపాయి విలువ మరీ దారుణంగా పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. మార్కెట్లో డాలర్ల కొరత ఏర్పడకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుంటేనే రూపాయికి కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లందరి దృష్టి ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాలపై ఉంది. ఆ రిపోర్టు వస్తేనే దేశ ఆర్థిక పరిస్థితి ఎటువైపు వెళ్తుందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది

PolitEnt Media

PolitEnt Media

Next Story