Rupee : రికార్డు కనిష్టం తర్వాత రూపాయి పవర్..డాలర్‌తో పోలిస్తే ఏకంగా 97 పైసలు బలం..ఆర్‌బీఐ చలవేనా?
డాలర్‌తో పోలిస్తే ఏకంగా 97 పైసలు బలం..ఆర్‌బీఐ చలవేనా?

Rupee : 2025 సంవత్సరంలో ఇప్పటివరకు భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే సుమారు 6 శాతం పడిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటిగా ఇది నిలిచింది. అయితే నాలుగో ట్రేడింగ్ రోజు గురువారం రూపాయి ప్రారంభ ట్రేడింగ్‌లో కొంత బలాన్ని చూపించి, డాలర్‌తో పోలిస్తే ఆరు పైసలు పెరిగి 90.32 వద్దకు చేరుకుంది. అంతకుముందు బుధవారం కూడా రూపాయి, తన జీవితకాల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని, 55 పైసలు బలపడి 90.38 వద్ద ముగిసింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ అనూహ్యమైన బలం పుంజుకోవడం వెనుక ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దూకుడుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండటమే. ఆర్‌బిఐ జోక్యం పడిపోతున్న రూపాయికి తక్షణ మద్దతు ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా పతనం దేశీయ ఆర్థిక బలహీనతల వల్ల కాదని, ప్రధానంగా బాహ్య కారకాల వల్లే ఈ ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, అమెరికా భారతీయ ఎగుమతులపై విధించిన భారీ సుంకాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరం నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి కదలికను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భూ-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కూడా ఫారెక్స్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు దారితీశాయి. గురువారం రోజున ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 91.05 వద్ద ప్రారంభమైనా, తర్వాత కోలుకుని, మునుపటి ముగింపు ధర కంటే దాదాపు 97 పైసల బలం పెరిగి 89.96 గరిష్ట స్థాయికి చేరింది.
కోటక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ దీపక్ అగర్వాల్ వంటి మార్కెట్ నిపుణులు రూపాయి పతనం దేశీయ బలహీనత కాదని, అమెరికా సుంకాలు, నిరంతర విదేశీ పెట్టుబడుల విత్ డ్రా వంటి ప్రపంచ ఒత్తిళ్ల పర్యవసానమే అని నొక్కి చెప్పారు. అయితే ఇటీవల పతనమైనప్పటికీ, భారతదేశం ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దేశీయంగా బలమైన జీడీపీ వృద్ధి రేటు, సంతృప్తికరమైన విదేశీ మారక నిల్వలు, నిర్వహించదగిన కరెంట్ ఖాతా లోటు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ అభిప్రాయం ప్రకారం.. టెక్నికల్ గా రూపాయికి 90.60 వద్ద బలమైన మద్దతు, 89.70 వద్ద పైభాగం నిరోధకత ఉండవచ్చని, అయినప్పటికీ ఆర్థిక, భూ-రాజకీయ పరిస్థితుల కారణంగా సమీప భవిష్యత్తులో అస్థిరత కొనసాగవచ్చని హెచ్చరించారు.

