Sachin Tendulkar : రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని జోరు.. ఏడాదికి రూ.50 కోట్లు సంపాదిస్తున్న క్రికెట్ దేవుడు
ఏడాదికి రూ.50 కోట్లు సంపాదిస్తున్న క్రికెట్ దేవుడు

Sachin Tendulkar : క్రికెట్ మైదానంలో సెంచరీల వర్షం కురిపించి క్రికెట్ దేవుడిగా వెలుగొందిన సచిన్ టెండూల్కర్, ఇప్పుడు బిజినెస్ పిచ్‌పై కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. నేడు (ఏప్రిల్ 24) సచిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కేవలం క్రికెట్‌లోనే కాదు, వ్యాపార సామ్రాజ్యంలోనూ ఎలా మాస్టర్ బ్లాస్టర్ అయ్యారో చూద్దాం. 2026 నాటికి సచిన్ ఆస్తుల విలువ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
రూ.1,415 కోట్ల నెట్ వర్త్ - సచిన్ సరికొత్త రికార్డు
సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి తప్పుకుని దశాబ్ద కాలం దాటినా ఆయన బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 2026 నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 170 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,415 కోట్లుగా అంచనా. కేవలం 2025 ఒక్క ఏడాదిలోనే ఆయన వివిధ పెట్టుబడులు, ప్రకటనల ద్వారా రూ.50 కోట్లకు పైగా సంపాదించడం విశేషం.
స్మార్ట్ ఇన్వెస్టర్‌గా సచిన్ ప్రస్థానం:
సచిన్ ఇప్పుడు కేవలం ప్రకటనల్లో కనిపించే సెలబ్రిటీ మాత్రమే కాదు, ఒక తెలివైన పెట్టుబడిదారుడు కూడా. ఆయన ఇప్పటివరకు సుమారు 14కు పైగా కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో దూసుకుపోతున్న స్పిన్నీ, గేమింగ్ రంగంలోని జెట్ సింథసిస్ వంటి సంస్థల్లో సచిన్ కీలక భాగస్వామి. గ్రీన్ ఎనర్జీపై ఉన్న మక్కువతో ట్రూజోన్ సోలార్ కంపెనీలో దాదాపు రూ.8 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇవే కాకుండా జెప్టో, పీబీ ఫిన్‌టెక్ వంటి స్టార్టప్స్‌లో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయి.
సొంత బ్రాండ్లు మరియు బిజినెస్ మోడల్:
కేవలం ఇతరుల కంపెనీల్లోనే కాకుండా, సచిన్ తన సొంత బ్రాండ్లను కూడా విజయవంతంగా నడుపుతున్నారు.
* TEN X YOU: ఇది యువత కోసం సచిన్ ప్రారంభించిన సరికొత్త ఫిట్‌నెస్, స్పోర్ట్స్ వేర్ బ్రాండ్.
* True Blue: అరవింద్ ఫ్యాషన్స్‌తో కలిసి సచిన్ పురుషుల దుస్తుల బ్రాండ్‌ను నడుపుతున్నారు.
* SRT Sports Management: సచిన్ కి సంబంధించిన అన్ని కమర్షియల్ డీల్స్, డిజిటల్ ప్రాజెక్టులను ఈ కంపెనీయే చూసుకుంటుంది.
నేటికీ బ్రాండ్ అంబాసిడర్‌గా నెంబర్ 1
మార్కెట్లో సచిన్ పై ఉన్న నమ్మకం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తనిష్క్, జిల్లెట్, లూమినస్ వంటి దిగ్గజ సంస్థలకు ఆయన ఇప్పటికీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఒక్కో ప్రకటన కోసం సచిన్ రోజుకు రూ.7 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తారంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం
ముంబైలోని బాంద్రాలో ఆయనకు అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. వీటితో పాటు ముంబైలో అపార్ట్‌మెంట్లు, అలీబాగ్‌లో భారీ ప్రాపర్టీలు ఉన్నాయి. ఆయన దగ్గరున్న రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువే దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుంది. తన అద్భుతమైన నిర్ణయాలు, పక్కా ప్లానింగ్‌తో సచిన్ టెండూల్కర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తిరుగులేని విజేతగా నిలుస్తున్నారు.

