Bank FD vs Post Office Schemes : డబ్బులు దాచుకోవడానికి ఏది బెస్ట్? బ్యాంక్ ఎఫ్‌డీనా లేక పోస్టాఫీస్ స్కీమ్సా?
బ్యాంక్ ఎఫ్‌డీనా లేక పోస్టాఫీస్ స్కీమ్సా?

Bank FD vs Post Office Schemes : ఎలాంటి రిస్క్ లేకుండా, స్థిరమైన ఆదాయం, గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే భారతీయ ఇన్వెస్టర్లకు ఇప్పటికీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలే మొదటి ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. బ్యాంక్ ఎఫ్‌డీలు కస్టమర్లకు ఆన్‌లైన్ నిర్వహణ, ఈజీ లిక్విడిటీ వంటి సౌకర్యాలను అందిస్తుంటే, పోస్టాఫీస్ పథకాలు మాత్రం నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. 2026 లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో, ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.
భద్రత విషయంలో ఏది టాప్?
ఈ రెండు పెట్టుబడి మార్గాల మధ్య ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యత్యాసం భద్రత. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌కు నేరుగా భారత ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది. అంటే మీరు డిపాజిట్ చేసే అసలు సొమ్ముతో పాటు వచ్చే వడ్డీకి కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. మరోవైపు, కమర్షియల్ బ్యాంకుల విషయానికి వస్తే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నిబంధనల ప్రకారం ఒక కస్టమర్ డిపాజిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తుంది. సాధారణంగా బ్యాంకులు కూడా సురక్షితమైనవే అయినప్పటికీ, ప్రభుత్వ గ్యారెంటీ పరంగా పోస్టాఫీస్ ఒక అడుగు ముందే ఉంటుంది.
పోస్టాఫీస్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?
ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికానికి గాను పోస్ట్ ఆఫీస్ తన వివిధ పొదుపు పథకాలపై 6.9% నుంచి 8.2% వరకు భారీ వడ్డీని అందిస్తోంది. 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9%, 3 సంవత్సరాల డిపాజిట్‌పై 7.1%, 5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.5% వడ్డీ లభిస్తోంది. వీటితో పాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పై 7.7% వడ్డీ వస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పై అత్యధికంగా 8.2% వడ్డీ రేటును కేంద్రం అందిస్తోంది.
బ్యాంకు ఎఫ్‌డీ రేట్ల పరిస్థితి ఏంటి?
మరోవైపు చూస్తే, బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల పాలసీలు, కాలపరిమితి ఆధారంగా మారుతుంటాయి. మే 2026 నాటి గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రముఖ షెడ్యూల్డ్ బ్యాంకులు సాధారణ పౌరులకు 2.5% నుంచి 8% వరకు వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కాలపరిమితులపై 8% కంటే ఎక్కువ వడ్డీని కూడా ఆఫర్ చేయడం విశేషం.
స్వల్పకాలిక పెట్టుబడులకు ఏది బెస్ట్?
ఒకవేళ మీరు కేవలం ఒక్క సంవత్సరం కాలపరిమితి కోసమే డబ్బులు దాచుకోవాలని అనుకుంటే, బ్యాంక్ ఎఫ్‌డీకి, పోస్టాఫీస్ డిపాజిట్‌కు పెద్దగా తేడా లేదు. 1 సంవత్సరం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌పై 6.9% వడ్డీ వస్తుండగా, దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు కూడా దీనికి సమానంగా లేదా అంతకంటే కొంచెం ఎక్కువ వడ్డీనే ఇస్తున్నాయి. దీనికి తోడు బ్యాంక్ ఎఫ్‌డీల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా డిపాజిట్లను క్లోజ్ చేసుకోవడం, ఎఫ్‌డీలపై తక్షణ రుణాలు పొందడం వంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఎఫ్‌డీలే ఎక్కువ కంఫర్ట్‌గా ఉంటాయి.
దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పోస్టాఫీస్ పైచేయి
కానీ, మీరు గనుక మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం పోస్టాఫీస్ స్కీమ్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. 3 ఏళ్ల కాలపరిమితికి పోస్టాఫీస్ 7.1% ఇస్తుంటే, కొన్ని బ్యాంకులు 6.25% నుంచి 7.40% మధ్య మాత్రమే ఇస్తున్నాయి. ఇక 5 ఏళ్ల లాంగ్ టర్మ్ విషయానికి వస్తే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ 7.5%, ఎన్‌ఎస్‌సీ 7.7% వడ్డీని ఇస్తున్నాయి. దీనికి భిన్నంగా చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదేళ్ల ఎఫ్‌డీలపై 6% నుంచి 6.3% వరకు, పెద్ద ప్రైవేట్ బ్యాంకులు 6.25% నుంచి 6.5% వరకు మాత్రమే వడ్డీ ఇస్తున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్‌లో పోస్టాఫీస్ ద్వారానే ఎక్కువ లాభం కనిపిస్తోంది.
పన్ను మినహాయింపులు, ఇతర రూల్స్
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి కనీసం రూ.1,000 అవసరం కాగా, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి 5 సంవత్సరాల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఐటీ చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది. అయితే, దీని ద్వారా వచ్చే వడ్డీ మాత్రం ఇన్వెస్టర్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ట్యాక్సబుల్ అవుతుంది. అలాగే పోస్టాఫీస్ లో వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించినప్పటికీ, చెల్లింపు మాత్రం సంవత్సరానికి ఒకసారే చేస్తారు. బ్యాంకుల లాగా ఇందులో ప్రతి నెలా వడ్డీ తీసుకునే ఆప్షన్ సాధారణంగా ఉండదు.

