2026లో 9.1% ఇంక్రిమెంట్లు ఖాయం

Salary Hike : ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు 2026 సంవత్సరం తీపి కబురు మోసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత జాబ్ మార్కెట్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా వెలువడిన ఏయాన్ ఇండియా 32వ వార్షిక వేతన సర్వే ప్రకారం.. 2026లో భారతీయ ఉద్యోగుల జీతాలు సగటున 9.1% మేర పెరిగే అవకాశం ఉంది. ఇది 2025లో నమోదైన 8.9% పెరుగుదల కంటే మెరుగ్గా ఉండటం విశేషం. సుమారు 45 పరిశ్రమలకు చెందిన 1,400 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు.

ఏ రంగాల్లో జీతాల పండుగ?

ఈ ఏడాది అన్ని రంగాల కంటే రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో భారీగా జీతాల పెరుగుదల ఉండనుంది. వీటితో పాటు ఆటోమొబైల్, ఇంజనీరింగ్ డిజైన్ సర్వీసెస్, తయారీ రంగం, రిటైల్ రంగాల్లో కూడా సగటు కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు లభించే ఛాన్స్ ఉంది. కంపెనీలు ఇప్పుడు కేవలం పని చేసే వారినే కాకుండా, టెక్నాలజీ, స్పెషల్ స్కిల్స్ ఉన్న నిపుణులను నిలుపుకోవడానికి ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

ప్రపంచ దేశాల కంటే భారత్ మేటి

జీతాల పెంపు విషయంలో భారత్ అగ్రరాజ్యాలను సైతం వెనక్కి నెట్టేసింది. అమెరికాలో జీతాల పెంపు కేవలం 4.3% గా ఉండగా, యూకేలో 4.1%, జర్మనీలో 3.9%, జపాన్‌లో 3.7%, చైనాలో 4.8% గా ఉండొచ్చని అంచనా. భారతదేశం 9.1% వృద్ధిని నమోదు చేయడం వెనుక బలమైన ఆర్థిక పునాది, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, కొత్త వాణిజ్య ఒప్పందాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మన దేశ జీడీపీ కూడా 6.2% వృద్ధి దిశగా సాగుతుండటంతో ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు.

తగ్గుతున్న ఉద్యోగాల మార్పిడి

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు మారడం అనేది సర్వసాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 2023లో 18.7% గా ఉన్న ఎట్రిషన్ రేట్ (ఉద్యోగం మానేసే వారి శాతం), 2025 నాటికి 16.2% కి తగ్గింది. అంటే ఉద్యోగులు ఇప్పుడు తమ కంపెనీల్లోనే స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు కొత్త వేతన కోడ్ అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ శాలరీ స్ట్రక్చర్‌ను మార్చుతున్నాయి. సుమారు 35% కంపెనీలు తమ బేసిక్ పేను పెంచాలని భావిస్తుండగా, మరికొన్ని సంస్థలు అలవెన్సుల్లో మార్పులు చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story