Salman Khan : రూ.5 పాన్ మసాలాలో 4 లక్షల కుంకుమపువ్వు? ఏంటి ఈ రచ్చ..సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు
సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు

Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈసారి సమస్య కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. అది కాస్తా ఫోర్జరీ ఆరోపణల వరకు వెళ్లింది. కోటలోని ఒక వినియోగదారుల కోర్టు సల్మాన్ ఖాన్‌కు షాక్ ఇస్తూ..వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అసలు రూ.5 పాన్ మసాలా ప్యాకెట్‌లో రూ.4 లక్షల విలువైన కుంకుమపువ్వు ఎలా ఉంటుందనే చిన్న లాజిక్‌తో మొదలైన ఈ కేసు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ సంతకం అసలైనదా కాదా అనే వివాదం వరకు చేరింది.
అసలేం జరిగిందంటే?
రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఇంద్ర మోహన్ సింగ్ అనే న్యాయవాది కన్స్యూమర్ కోర్టులో ఒక ఫిర్యాదు చేశారు. రాజశ్రీ పాన్ మసాలా ప్రకటనలో సల్మాన్ ఖాన్ కనిపిస్తూ.. ఇది "కుంకుమపువ్వు కలిపిన మసాలా" అని ప్రచారం చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో కిలో కుంకుమపువ్వు ధర దాదాపు రూ.4 లక్షలు ఉంటుంది. మరి కేవలం రూ.5 ప్యాకెట్‌లో అసలైన కుంకుమపువ్వు ఎలా వేస్తారు? ఇది కస్టమర్లను మోసం చేయడమేనని, యువతను క్యాన్సర్ కారక పదార్థాల వైపు మళ్లించడమేనని ఆయన కోర్టులో వాదించారు.
సంతకం దొంగదా? అసలుదా?
ఈ కేసు విచారణలో ఉండగానే మరో ఊహించని మలుపు తిరిగింది. సల్మాన్ ఖాన్ తరపున కోర్టులో దాఖలు చేసిన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలపై ఉన్న సంతకాలు నకిలీవని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. గతంలో సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ జైలులో ఉన్నప్పుడు, అక్కడి కోర్టులో చేసిన సంతకాలకు, ఇప్పుడు ఈ పత్రాలపై ఉన్న సంతకాలకు అస్సలు పొంతన లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే సల్మాన్ సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి కోర్టును తప్పుదోవ పట్టించారని వాదించారు. ఇది నేరం కిందికి వస్తుందని పేర్కొన్నారు.
జనవరి 20న కోర్టు ముందుకు భాయ్
ఈ ఆరోపణలను కోటా వినియోగదారుల కోర్టు అత్యంత సీరియస్‌గా తీసుకుంది. సల్మాన్ ఖాన్ సంతకాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వివాదంపై స్వయంగా సమాధానం చెప్పేందుకు జనవరి 20వ తేదీన సల్మాన్ ఖాన్ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఆ పత్రాలను నోటరీ చేసిన లాయర్ ఆర్‌సీ చౌబేను కూడా కోర్టు విచారణకు పిలిచింది. దీంతో ఈ కేసు ఇప్పుడు బాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

