భారీగా డిమాండ్

Dasheri Mango : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, 1,200 కిలోగ్రాముల దషెరీ మామిడిపండ్లను (400 పెట్టెలు, ఒక్కొక్కటి మూడు కిలోల బరువు) విమాన మార్గం ద్వారా దుబాయ్‌కి పంపారు. ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ ప్రకటన ప్రకారం దిగుమతి చేసుకున్న సంస్థ వర్గ్రో ట్రేడింగ్ ఎల్ఎల్సి, దుబాయ్, యూఏఈ. పంపిన మామిడిపండ్ల మొత్తం విలువ 2,992 అమెరికన్ డాలర్లు. ఇది ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిదారులకు ప్రపంచ మార్కెట్‌లో కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది.

రాష్ట్ర ఉద్యానవన, వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ ఈ సరుకును దుబాయ్‌కి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇండో-జర్మన్ ఏఎండీ ప్రాజెక్ట్ కింద లక్నో ప్రాంతం నుంచి ఎంపిక చేసిన మూడు FPO (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) లకు వ్యవసాయ ఎగుమతుల్లో శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేశారు. వీటిలో ఇరాదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అండ్ మలిహాబాద్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ లకు దుబాయ్ నుంచి దషెరీ మామిడికి నేరుగా ఆర్డర్ లభించింది.

ఈ రెండు FPO (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లు ఈ సంవత్సరం మొదటిసారిగా దుబాయ్‌కి మామిడిని ఎగుమతి చేస్తున్నాయి. ఇది ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిదారులకు ఒక చారిత్రక ఘనత. ఈ సందర్భంగా దినేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో మామిడి ఎగుమతులు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిదారులు తమ బలమైన గుర్తింపును ఏర్పరచుకోవడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

దషెరీ మామిడి లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో చాలా పాపులర్. ఈ మామిడి తన తియ్యని, మంచి సువాసనతో కూడిన రుచికి ప్రసిద్ధి చెందింది. ఇది ఉత్తర భారతదేశం, ఆంధ్రప్రదేశ్, నేపాల్, పాకిస్తాన్‌లో కూడా పండిస్తారు. మలిహాబాద్ దషెరీ మామిడికి అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. మలిహాబాద్ దషెరీ మామిడి విదేశాలతో పాటు దేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. మలిహాబాద్ దషెరీ మామిడి సాధారణంగా లభించే దషెరీ మామిడి కంటే సైజ్, బరువులో చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ ఎగుమతులు ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలను సృష్టించి, వారికి మరింత ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయని ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story