SBI Data Leak: ఎస్ఐబీ ఖాతాదారులకు బిగ్ షాక్.. మొబైల్ నంబర్లు అలాగే అడ్రస్‌లు డార్క్ వెబ్‌లో లీక్
అలాగే అడ్రస్‌లు డార్క్ వెబ్‌లో లీక్

SBI Data Leak: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంరైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో లీకైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వినియోగదారుల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, పుట్టిన తేదీలు అలాగే నివాస చిరునామాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రాగానే అప్రమత్తమైన బ్యాంక్ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు అక్టోబర్ 21వ తేదీన స్టాక్ మార్కెట్లకు ఒక అధికారిక నివేదికను సమర్పించి, భద్రతాపరమైన చర్యలు వేగవంతం చేసినట్లు స్పష్టం చేసింది.
గత అక్టోబర్ 16వ తేదీన బ్యాంక్‌కు సెక్యూరిటీ సేవలు అందించే రక్ష సైబర్ ఏజెన్సీ అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన cert-in నుంచి ఎస్బీఐకి అత్యవసర హెచ్చరిక అందింది. దీని ప్రకారం డార్క్ వెబ్‌లో బ్యాంక్ కస్టమర్ల డేటా బహిర్గతమైనట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బ్యాంక్ అధికారులు సుమారు 3.75 లక్షల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రాథమిక విచారణలో సుమారు 3,897 మంది ఖాతాదారులకు చెందిన కీలకమైన వ్యక్తిగత గుర్తింపు (PII) వివరాలు లీకైనట్లు స్పష్టమైంది. లోన్ రికార్డులు, సీఐఎఫ్ నంబర్లు అలాగే బ్రాంచ్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇంత పెద్ద ఎత్తున డేటా లీక్ కావడంతో కస్టమర్లలో తమ డబ్బు సురక్షితంగా ఉంటుందా లేదా అనే భయం మొదలైంది. అయితే ఎస్బీఐ మాత్రం ఈ ఘటన వల్ల బ్యాంక్ సాధారణ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని భరోసా ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. లీకైన డేటా ఎంతవరకు నిజమనేది తేల్చేందుకు సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని రంగంలోకి దించారు.
వ్యక్తిగత సమాచారం లీకైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు మోసపూరిత కాల్స్ లేదా ఫిషింగ్ లింకుల ద్వారా వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. బ్యాంక్ ఎప్పుడూ కూడా ఓటీపీ లేదా పాస్‌వర్డ్‌లను ఫోన్ ద్వారా అడగదని అధికారులు గుర్తు చేస్తున్నారు. కస్టమర్లు ఎవరైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ అధికారిక ఛానెళ్లను మాత్రమే సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

