SBI Schemes: భారతదేశంలో పొదుపు అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తువచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). డబ్బు భద్రత కోసమే కాకుండా ప్రశాంతత కోసం ఎఫ్‌డీలపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అయితే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఎఫ్‌డీల ద్వారా వచ్చే రాబడి సరిపోవడం లేదు. పైగా దానిపై పడే పన్ను భారం లాభాలను మరింత తగ్గిస్తోంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ, ఎఫ్‌డీల కంటే మెరుగైన రాబడిని అందించే ఎస్‌బీఐ (SBI) మ్యూచువల్ ఫండ్స్ డెట్, హైబ్రిడ్ స్కీమ్స్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.

ఎఫ్‌డీకి ప్రత్యామ్నాయంగా ఎస్‌బీఐ డెట్ స్కీమ్స్

మీ కష్టపడి సంపాదించిన డబ్బును ఎఫ్‌డీ కంటే వేగంగా, సురక్షితంగా వృద్ధి చేసుకోవడానికి ఎస్‌బీఐ డెట్ పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో మార్కెట్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడిదారులకు ఎఫ్‌డీలతో పోలిస్తే మెరుగైన లిక్విడిటీ లభిస్తుంది. అంటే మీకు ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. వివిధ కాలపరిమితులకు అనుగుణంగా ఎస్‌బీఐలో అనేక అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.

స్వల్పకాలిక పెట్టుబడులకు అద్భుతమైన మార్గాలు

మీ వద్ద ఉన్న డబ్బును 3 నుంచి 12 నెలల స్వల్పకాలిక కాలానికి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్‌బీఐ సేవింగ్స్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది ఒక మనీ మార్కెట్ ఫండ్ కావడం విశేషం. ట్రెజరీ బిల్లులు లేదా కమర్షియల్ పేపర్ల వంటి అత్యంత సురక్షితమైన సాధనాలలో ఈ ఫండ్ పెట్టుబడి పెడుతుంది. అలాగే 1 నుంచి 2 సంవత్సరాల మధ్య కాలానికి పెట్టుబడి పెట్టాలని చూసేవారు ఎస్‌బీఐ లో డ్యురేషన్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఇవి స్వల్ప కాలంలోనే ఎఫ్‌డీల కంటే అధిక లాభాలు అందించే సత్తా కలిగి ఉన్నాయి.

ప్రభుత్వ బాండ్లు, పీఎస్‌యూ ఫండ్స్‌తో భద్రత

మీ పెట్టుబడి కాలపరిమితి 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటే ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్ చాలా బలమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ ఫండ్ తన పెట్టుబడిలో 80 శాతానికి పైగా పెద్ద బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో (PSU) మదుపు చేస్తుంది. అంతేకాకుండా అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ (AAA) కలిగిన ఆర్థిక సంస్థల బాండ్లలో కూడా పెట్టుబడులు పెడతాయి. దీనివల్ల నష్టపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

పన్ను మినహాయింపుతో పాటు భారీ లాభాలు

షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి సురక్షితంగా ఉండాలనుకునే వారికి ఎస్‌బీఐ ఆర్బిట్రేజ్ ఫండ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ చక్కటి ప్రత్యామ్నాయాలు. బ్యాంకు ఎఫ్‌డీల నుంచి వచ్చే వడ్డీపై మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పూర్తి పన్ను పడుతుంది. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కాలానికి తగినట్లుగా పన్ను మినహాయింపులు లభిస్తాయి. దీనివల్ల మీ సంపదపై పన్ను భారం తగ్గి నికర లాభం పెరుగుతుంది.

భద్రతతో పాటు అధిక లాభాలు, పన్ను మినహాయింపులు కోరుకునే పెట్టుబడిదారులకు ఎస్‌బీఐకి చెందిన ఈ డెట్, హైబ్రిడ్ పథకాలు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలకు తగినట్లు సరైన పథకాన్ని ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తును ఆర్థికంగా మరింత సురక్షితం చేసుకోవచ్చు.

Next Story