Petrol Price Hike : దేశంలో ఐదు రోజుల్లో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు 4 రూపాయల వరకు పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. అయితే ఈ హఠాత్ ధరల పెంపు వెనుక ఉన్న అసలు ఆర్థిక కారణాలను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ఇకోరాప్ నివేదికలో విశ్లేషించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నప్పటికీ, దేశీయంగా చాలా కాలం పాటు రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు ఏకంగా రూ.1,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూశాయని ఎస్‌బీఐ తెలిపింది. ఈ లెక్కన ఏడాదికి రూ.3.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుండటంతో, కంపెనీలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

మరోసారి పెరగనున్న ద్రవ్యోల్బణం

ఇంధన ధరల పెంపుతో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మే-జూన్ 2026 లో 0.15 నుంచి 0.20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ పేర్కొంది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం 2026-27కు గాను ద్రవ్యోల్బణం అంచనా 4.7 శాతానికి చేరింది. అయితే చమురు ధరలు పెరిగిన ప్రారంభంలో ప్రజలు వాహనాల వాడకాన్ని తగ్గించి ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటారని, కానీ కొద్ది రోజులకే అలవాటు పడి మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తారని నివేదిక విశ్లేషించింది. అందువల్ల వార్షిక ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో ఎలాంటి పెద్ద తగ్గుదల ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుత రూ.4 పెంపు ద్వారా చమురు కంపెనీలకు లభించే రూ.52,700 కోట్ల ఉపశమనం వారి మొత్తం నష్టాల్లో కేవలం 15 శాతం మాత్రమే కావడం గమనార్హం.

టాక్స్ తగ్గిస్తే ఖజానా ఖాళీ

కస్టమర్లకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని (ప్రస్తుతం పెట్రోల్‌పై 11.9%, డీజిల్‌పై 7.8%) పూర్తిగా సున్నా చేస్తే గనుక దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతుందని నివేదిక హెచ్చరించింది. పన్నులు పూర్తిగా ఎత్తేస్తే కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.1.9 లక్షల కోట్ల గండి పడుతుందని, ఇది దేశ ద్రవ్యోల్బణ లోటును జీడీపీలో 0.5 శాతానికి పెంచుతుందని తెలిపింది. మార్చిలో చేసిన రూ.10 సుంకం తగ్గింపు నష్టాన్ని కూడా కలిపితే ప్రభుత్వ మొత్తం లోటు రూ. 3 లక్షల కోట్లకు చేరుతుంది. అంతేకాకుండా, కేంద్రం పన్నులు సున్నా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం రూ.80,000 కోట్ల భారీ షాక్ తగులుతుంది. పెరిగిన ధరల వల్ల రాష్ట్రాలకు వచ్చే రూ.30,000 కోట్ల అదనపు వ్యాట్ లాభాన్ని మినహాయించినా, రాష్ట్రాల నికర నష్టం రూ.50,000 కోట్లుగా ఉండనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story