SBI Mutual Fund : స్టాక్ మార్కెట్‌లో నిరంతరం ఉండే హెచ్చుతగ్గుల మధ్య సరైన షేర్లను ఎంచుకోవడం సామాన్య ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ముఖ్యంగా రిస్క్‌తో పాటు భారీ లాభాల అవకాశాలు ఉండే మిడ్‌క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. ఇన్వెస్టర్ల ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోనే అతిపెద్ద ఫండ్ హౌస్ అయిన ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ జూలై 27, 2026న ఒక సరికొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్కీమ్‌కు ఎస్‌బిఐ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మోమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని పేరు పెట్టారు. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ పథకం.

ఎలా పనిచేస్తుంది ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్?

మార్కెట్‌లో మోమెంటమ్ ఇన్వెస్టింగ్ అంటే మార్కెట్ పెరుగుతున్న సమయంలో బలంగా ఉన్న స్టాక్స్‌పై పెట్టుబడి పెట్టడం. ఈ ఫండ్ ఇటీవల కాలంలో తమ పోటీదారులతో పోలిస్తే అత్యంత అత్యుత్తమ పనితీరు కనబరిచిన షేర్లపై దృష్టి పెడుతుంది. ఈ పథకం నేరుగా షేర్లలో డబ్బులు పెట్టదు. దీనికి బదులుగా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన నిధులలో 95 నుండి 100 శాతం వరకు ఎస్‌బిఐ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మోమెంటమ్ 50 ఈటీఎఫ్ యూనిట్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఇండెక్స్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150లోని టాప్ 50 బలమైన కంపెనీల సమాహారం. అలాగే లిక్విడిటీ అవసరాల కోసం మిగిలిన 0 నుంచి 5 శాతం నిధులను సురక్షితమైన ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కేటాయిస్తారు.

కేవలం రూ.5,000తో ప్రారంభించే వెసులుబాటు

ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేసిన ఈ నూతన ఎన్ఎఫ్ఓ సబ్‌స్క్రిప్షన్ కోసం జూలై 27న ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు ఆగస్టు 05, 2026 వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఫండ్‌లో చేరడం చాలా సులభం. కనీసం రూ.5,000 ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఒక్క రూపాయి గుణకాల్లో ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా క్రమబద్ధంగా చిన్న చిన్న మొత్తాలు దాచుకోవాలనుకునే వారి కోసం ఎస్‌ఐపీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్లు తమ వీలును బట్టి డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ లేదా ఇయర్లీ ఎస్‌ఐపీ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

డీమ్యాట్ అకౌంట్ లేకుండానే ఈటీఎఫ్‎ ప్రయోజనాలు

సాధారణంగా ఏదైనా ఈటీఎఫ్‎లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ తప్పనిసరి. ఇది చాలా మంది కొత్త ఇన్వెస్టర్లకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఫండ్ ఆఫ్ ఫండ్ నిర్మాణంలో ఉంటుంది. అంటే డీమ్యాట్ అకౌంట్ లేని వారు కూడా ఏదైనా సాధారణ మ్యూచువల్ ఫండ్ లాగే ఇందులో సులువుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ కీలకమైన స్కీమ్‌ను మేనేజ్ చేసే బాధ్యతను అనుభవజ్ఞుడైన ఫండ్ మేనేజర్ విరాల్ ఛాడ్వాకు ఎస్‌బిఐ అప్పగించింది. విరాల్ డిసెంబర్ 2020 నుంచి ఎస్‌బిఐతో కలిసి అనేక పాసివ్ ఫండ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story