SBI Strike Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం ప్రారంభంలో బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతుండటంతో బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన 52 కోట్ల మందికి పైగా ఉన్న కస్టమర్లను ముందుగానే అప్రమత్తం చేసింది. నగదు విత్‌డ్రాలు, ఇతర అత్యవసర లావాదేవీల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. బ్యాంకు శాఖలకు వచ్చే బదులు ఏటీఎంలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.

ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక సోషల్ మీడియా వేదిక X ద్వారా ఖాతాదారులకు కలిగే అసౌకర్యానికి ముందే క్షమాపణలు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 23,200 కి పైగా శాఖలలో కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. అయితే ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటే మాత్రం సాధారణ సేవలు కుంటుపడటం ఖాయమని స్పష్టమవుతోంది.

ఎప్పటి నుండి సమ్మె?

ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) మే 25 వ తేదీ నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తూ బ్యాంక్ యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. అయితే, కస్టమర్లకు అసలైన ఇబ్బంది ఇక్కడే మొదలైంది. మే 25 (సోమవారం) సమ్మె ప్రారంభం కావడానికి ముందే మే 23 న నాల్గవ శనివారం, మే 24 న ఆదివారం కావడంతో బ్యాంకులకు ఎలాగూ సెలవు ఉంటుంది.

ఇక మే 25, 26 తేదీల్లో ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఆ తర్వాతి రోజైన మే 27న బక్రీద్ పండుగ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే శనివారం నుంచి బుధవారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. అందుకే కస్టమర్లు ముందే డబ్బులు సర్దుబాటు చేసుకోవడం మంచిది.

బ్యాంకులు మూతపడినా కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్లు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను డిజిటల్ పేమెంట్ల కోసం వాడుకోవచ్చని సూచించింది. అలాగే బ్యాంకు కస్టమర్ కేర్ సెంటర్లు, ఏటీఎం కేంద్రాలలో నగదు కొరత లేకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

ఎస్బీఐ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే

బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఇంత హఠాత్తుగా సమ్మెకు వెళ్లడానికి బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నాయి. వారి ప్రధాన డిమాండ్లు ఇవే..

* కొత్త నియామకాలు: బ్యాంకుల్లో పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, కాబట్టి తక్షణమే తగినంత మంది సిబ్బందిని, ముఖ్యంగా మెసెంజర్లు, ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ గార్డులను రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

* అవుట్‌సోర్సింగ్ బంద్ చేయాలి: బ్యాంకుల్లో శాశ్వత ప్రాతిపదికన చేసే పనులను ప్రైవేట్ సంస్థలకు అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని, ఫ్రాడ్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపు చోరీ) జరిగి బ్యాంక్ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

* వర్క్‌మెన్ డైరెక్టర్ నియామకం: బ్యాంక్ మేనేజ్మెంట్ బోర్డులో వర్క్‌మెన్ ఎంప్లాయ్ డైరెక్టర్‌ను నియమించాలని కోరుతున్నారు.

* పెన్షన్ ఫండ్ మేనేజర్ మార్పు: ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు తమ పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే స్వేచ్ఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

* యాజమాన్యంతో జరిపే చర్చలు సఫలమైతేనే ఈ సమ్మె విరమించే అవకాశం ఉంది. లేదంటే వచ్చే వారం ఎస్బీఐ కస్టమర్లకు బ్యాంకింగ్ తిప్పలు తప్పవు.

PolitEnt Media

PolitEnt Media

Next Story