ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్లపై ఛార్జీల మోత

SBI : మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? తరచుగా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేస్తుంటారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఆగస్టు 15వ తేదీ నుండి IMPS ద్వారా చేసే ఆన్‌లైన్ నగదు బదిలీలకు ఎస్బీఐ ఛార్జీలు వసూలు చేయబోతుంది. రూ.25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేసే కస్టమర్లకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. అయితే ఇది కేవలం ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే పరిమితం. బ్యాంకుకు వెళ్లి IMPS ద్వారా చేసే బదిలీలకు ఈ రుసుము ఉండదు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్టు 15వ తేదీ నుండి, IMPS ఉపయోగించి రూ.25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తే, బదిలీ చేసిన మొత్తాన్ని బట్టి రూ.2 నుండి రూ.10 వరకు రుసుము వసూలు చేయనుంది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా ఉంటుంది. ఈ ఛార్జీలు ఎలా ఉంటాయంటే...

రూ.25,000 నుండి రూ.1 లక్ష వరకు నగదు బదిలీలకు: రూ.2 సర్వీస్ ఛార్జ్ + GST

రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల మధ్య నగదు బదిలీలకు: రూ.6 సర్వీస్ ఛార్జ్ + GST

రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య నగదు బదిలీలకు: రూ.10 సర్వీస్ ఛార్జ్ + GST

ఈ కొత్త నిబంధనలు కార్పొరేట్ కస్టమర్లకు సెప్టెంబర్ 8 నుండి అమలులోకి వస్తాయి. అయితే సాధారణ కస్టమర్లకు మాత్రం ఆగస్టు 15 నుంచే వర్తిస్తాయి.

ఎవరికి ఈ ఛార్జీలు ఉండవు?

ఒక మంచి విషయం ఏమిటంటే, ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఉన్నవారికి ఈ ఛార్జీలు ఉండవు. అంతేకాకుండా, గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం అకౌంట్ హోల్డర్లు, ప్రభుత్వ విభాగాల కరెంట్ ఖాతాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు వంటి కొన్ని ప్రత్యేక ఖాతాలకు కూడా IMPS లావాదేవీలపై ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చారు.

UPIకి కూడా వర్తిస్తుందా?

IMPS నెట్‌వర్క్‌పైనే యూపీఐ పనిచేసినప్పటికీ, ఈ కొత్త సర్వీస్ ఛార్జీలు UPI చెల్లింపులకు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది. కాబట్టి, యూపీఐ ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి అదనపు రుసుము ఉండదు. ఇది డిజిటల్ చెల్లింపులు చేసేవారికి ఒక ఊరటనిచ్చే విషయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story