క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు తీసుకోండి!

Cash Withdrawal : భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పద్ధతి నిరంతరం మారుతోంది. యూపీఐ పేమెంట్స్ సిస్టమ్‎లో అప్ డేట్స్, దాని వినియోగం పెరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించడానికి యూపీఐ ఉపయోగపడుతోంది. ఇప్పుడు యూపీఐని ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం కూడా ఉపయోగించనున్నారు. బ్యాంక్‌లలో యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించే ఆలోచన జరుగుతోంది.

మొబైల్ ఫోన్‌ల నుండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే సౌకర్యాన్ని కల్పించాలని ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసిందని ఒక నివేదికలో పేర్కొన్నారు. దేశంలో విస్తృతంగా ఉన్న బ్యాంక్ ఉప శాఖలలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి బ్యాంక్ శాఖలు లేదా బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల బీసీలు ఉన్నారు. వీటన్నింటిలోనూ యూపీఐ నగదు ఉపసంహరణ సౌకర్యం కల్పిస్తే కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుతం దేశంలో కొన్ని ఎంపిక చేసిన ఏటీఎంలలో మాత్రమే యూపీఐ ద్వారా నగదు విత్ డ్రా సౌకర్యం ఉంది. ఇది కాకుండా, ఆధార్ ఫింగర్‌ప్రింట్ ద్వారా కూడా డబ్బులు తీసుకోడానికి అవకాశం ఉంది. కానీ ఈ రెండు వ్యవస్థలలోనూ లిమిట్స్ ఉన్నాయి. యూపీఐతో పనిచేసే ఏటీఎంలలో మీరు నగరాల్లో రూ. 1,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,000 వరకు తీసుకోవచ్చు. అలాగే, బయోమెట్రిక్ అథెంటికేషన్ కొన్నిసార్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు.

ఎన్‌పీసీఐ ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకుల ఉప-శాఖలలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఒక్కసారిగా రూ.10,000 వరకు డ్రా చేయడానికి అవకాశం కల్పించాలి. ఒక ట్రాన్సాక్షన్ నుండి మరొక ట్రాన్సాక్షన్‌కు 30 నిమిషాల వ్యవధి ఉండాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఏటీఎం కార్డు మర్చిపోయినవారికి, లేదా కార్డు లేనివారికి, దగ్గరలో ఏటీఎంలు లేనివారికి ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రజలకు నగదును సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక కొత్త, విప్లవాత్మక మార్గంగా మారే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story