Rajesh Exports : రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అకౌంట్లకు ఫోరెన్సిక్ ఆడిట్.. ప్రమోటర్ రాజేష్ మెహతాపై సెబీ సంచలన నిషేధం
ప్రమోటర్ రాజేష్ మెహతాపై సెబీ సంచలన నిషేధం

Rajesh Exports : ఆర్థిక అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఈ కంపెనీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ నివేదిక ఇవ్వడంతో.. ఇప్పుడు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతగానో ఉపయోగపడే అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్ తయారీ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం నుంచి ఈ కంపెనీని పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది.
కుమారస్వామి పరిధిలోకి చేరిన ఫైల్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థను ఈ ప్రభుత్వ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తప్పించాలనే విషయంలో మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు ఒక బలమైన నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన తుది నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి పరిశీలనకు పంపారు. ఆయన ఇటీవల కిర్గిజిస్తాన్ అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చినందున.. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కంపెనీ భవితవ్యంపై మంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రూ.15.15 లక్షల కోట్ల భారీ ఆదాయ మాయాజాలం
నిజానికి జూన్ 3వ తేదీన సెబీ విడుదల చేసిన 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై కళ్లు బైర్లు గమ్మే ఆరోపణలు చేసింది. 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో కంపెనీ తన అసలు రాబడిని (రెవెన్యూ) ఏకంగా 15.15 లక్షల కోట్ల రూపాయల మేర పెంచి చూపించిందని సెబీ గుర్తించింది. ఈ అదనంగా చూపించిన మొత్తం కంపెనీకి చెందిన అనుబంధ సంస్థల మొత్తం ఆదాయంలో 99.8 శాతం కావడం గమనార్హం. కేవలం పేపర్ల మీద మాత్రమే లాభాలు ఉన్నట్లు చూపించి మార్కెట్‌ను బురిడీ కొట్టించారని సెబీ దర్యాప్తులో తేలింది.
నిధుల మళ్లింపు.. ప్రమోటర్‌పై నిషేధం
ఇవే కాకుండా.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన లిథియం-అయాన్ సెల్ వ్యాపార విభాగాలు అయిన ఎలెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీసీ ఎనర్జీ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలలో నిధుల మళ్లింపు జరిగిందని.. అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించడంతో పాటు కంపెనీ రూల్స్ ప్రకారం స్టాక్ మార్కెట్‌కు ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెట్టారని సెబీ ఆరోపించింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సెబీ.. కంపెనీ ప్రమోటర్ కమ్ చైర్మన్ రాజేష్ మెహతాను తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధించింది. అంతేకాకుండా కంపెనీ అకౌంట్లపై కొత్తగా ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు తగలబోతున్న గట్టి దెబ్బ
ప్రస్తుతం ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ పీఎల్ఐ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షిస్తున్న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. సెబీ ఇచ్చిన ఆర్డర్ కాపీని పూర్తిగా స్టడీ చేస్తోంది. చట్టపరంగా ముందడుగు వేసే ముందు అన్ని కోణాలను నిపుణులతో సమీక్షిస్తోంది. అయితే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, దాని చైర్మన్ రాజేష్ మెహతా మాత్రం సెబీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని.. తాము నిర్దోషులమని, దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక ఈ కంపెనీని పీఎల్ఐ స్కీమ్ నుండి బ్లాక్‌లిస్ట్‌లో పెడితే.. అది రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఉనికికే పెద్ద దెబ్బ కావడమే కాకుండా.. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీ రంగానికి కూడా కాస్త ఎదురుదెబ్బే అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

