ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్

SEBI : పెట్టుబడిదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక హెచ్చరిక జారీ చేసింది. రిజిస్టర్ కాని ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటి ద్వారా లావాదేవీలు చేయకూడదని సెబీ స్పష్టం చేసింది. ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఎటువంటి నియంత్రణ పర్యవేక్షణ ఉండదని, పెట్టుబడిదారుల రక్షణకు గానీ, ఫిర్యాదుల పరిష్కారానికి గానీ ఎలాంటి వ్యవస్థ ఉండదని సెబీ పేర్కొంది. అందుకే బాండ్లలో పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సెబీ విజ్ఞప్తి చేసింది.

రిజిస్టర్ కాని ప్లాట్‌ఫారమ్‌లలో లావాదేవీలు చేయడం చాలా ప్రమాదకరం. ఈ ప్లాట్‌ఫారమ్‌లపై సెబీ తరపున ఎలాంటి పర్యవేక్షణ ఉండదు.పెట్టుబడిదారుల రక్షణ లేదా ఫిర్యాదుల గ్రీవెన్స్ సిస్టమ్ అందుబాటులో ఉండదు. ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ల కార్యకలాపాలు కంపెనీల చట్టం 2013, సెబీ చట్టం 1992, దానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉంది. ఈ కారణంగానే సెబీ నవంబర్ 18, 2024న కూడా కొన్ని సంస్థలపై చర్యలు తీసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మార్కెట్లో పారదర్శకతను పెంచడానికి సెబీ నవంబర్ 2022లో ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్లుగా సేవలు అందించాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజ్ డెట్ సెగ్మెంట్‌లో స్టాక్‌బ్రోకర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ నిబంధనలను పాటించకుండా కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు, షేర్ బ్రోకర్లు ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్‌ల వలె సేవలు అందిస్తున్నట్లు సెబీ గుర్తించింది. ఇలాంటి చర్యలు నియమాలను ఉల్లంఘించినట్లేనని హెచ్చరించింది.

ప్రస్తుతం దేశంలో 18 రిజిస్టర్డ్ ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్లు(OBPP) ఉన్నారు. వీటి ద్వారా పెట్టుబడిదారులు కార్పొరేట్ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. OBPPలు భారతదేశ బాండ్ మార్కెట్‌లో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడంలో ముఖ్యపాత్ర పోషించాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ 2025 నివేదిక ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారమ్‌లు బాండ్‌ల కొనుగోలును షేర్ ట్రేడింగ్ చేసినంత సులభంగా మార్చాయి. పెట్టుబడిదారులు తమ డబ్బు సురక్షితంగా ఉండాలంటే రిజిస్టర్డ్ OBPPల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని సెబీ మరోసారి స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story