SEBI : భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ రంగానికి పెద్ద ఊరటనిచ్చింది. శుక్రవారం జరిగిన కీలక బోర్డు సమావేశంలో స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్లో షేర్ల బైబ్యాక్ ప్రక్రియను తిరిగి ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ కొత్త నిబంధనలు రాబోయే ఆగస్టు 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీలు తమ షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేయడానికి 66 పని దినాల కాలపరిమితిని సెబీ నిర్దేశించింది. దీనివల్ల కంపెనీలకు పాత పేపర్‌వర్క్ తగ్గి ఆపరేషనల్ ఎఫిషియెన్సీ పెరుగుతుంది.

గతంలో ఎందుకు నిషేధించారంటే?

సాధారణంగా ఒక కంపెనీ వద్ద అదనపు నగదు నిల్వలు ఉన్నప్పుడు లేదా మార్కెట్లో తమ షేర్ల విలువ వాస్తవిక ధర కంటే తక్కువగా ఉందని భావించినప్పుడు బైబ్యాక్ ప్రక్రియను చేపడుతుంది. దీనివల్ల మార్కెట్లో షేర్ల సంఖ్య తగ్గి ప్రత్యామ్నాయంగా ఈపీఎస్ మెరుగవుతుంది. అయితే, ఈ ఓపెన్ మార్కెట్ విధానం వల్ల కొందరు బడా ఇన్వెస్టర్లకే ఎక్కువ లాభం జరుగుతోందని, పన్నుల పరంగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో 2025 లో సెబీ దీనిని నిలిపివేసింది. ప్రస్తుతం కంపెనీల క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేయడానికి కొన్ని కఠిన నిబంధనలతో దీనిని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు.

మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ మరింత సులభం

మ్యూచువల్ ఫండ్స్ రంగంలో లక్విడిటీ సమస్యలను అధిగమించడానికి సెబీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ రోజువారీ క్యాష్ మేనేజ్‌మెంట్ అవసరాల కోసం ఇంట్రా-డే రుణాలు తీసుకోవడానికి అనుమతించారు. ఇన్వెస్టర్ల రిడెంప్షన్ పేమెంట్లు, విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు, డెరివేటివ్స్ పొజిషన్ల వల్ల వచ్చే టైమింగ్ మిస్‌మ్యాచ్‌లను అధిగమించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని సెబీ చైర్మన్ తెలిపారు. అయితే ఈ రుణాలు ఆ రోజే మార్కెట్ ముగిసేలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

షేర్ల బదిలీ ప్రక్రియ సరళతరం

ఇన్వెస్టర్ల మరణం తర్వాత వారి కుటుంబ సభ్యులు లేదా నామినీలు ఆయా షేర్లను తమ పేరిట మార్చుకోవడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సెబీ తెరదించింది. చిన్న మొత్తాల క్లెయిమ్‌ల కోసం క్విక్ ట్రాన్స్‌మిషన్ ప్రాసెసింగ్ అనే సరికొత్త కేటగిరీని ప్రారంభించింది. ఈ సదుపాయం కింద ఫిజికల్ షేర్లు అయితే రూ.10,000 వరకు, డీమాట్ షేర్లు అయితే రూ.30,000 వరకు ఉన్న క్లెయిమ్‌లను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తారు. అంతేకాకుండా, ఎలాంటి సంక్లిష్ట డాక్యుమెంట్లు లేకుండా సాధారణ పత్రాలతో బదిలీ చేసే గరిష్ట పరిమితిని భౌతిక షేర్లకు రూ.10 లక్షలు, డీమాట్ షేర్లకు రూ.30 లక్షల వరకు పెంచుతూ డబుల్ ఊరటనిచ్చారు.

ఏఐఎఫ్ రంగం కోసం గరుడ మెకానిజం

ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సెబీ GARUDA పేరుతో ఒక గ్రీన్ ఛానెల్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఈ విధానం ద్వారా అర్హత కలిగిన ఏఐఎఫ్ స్కీమ్‌లు తమ ప్లేస్‌మెంట్ మెమోరాండం ఫైల్ చేసిన కేవలం 10 పని దినాలలోనే మార్కెట్ నుండి నిధుల సేకరణ ప్రారంభించుకోవచ్చు. గతంలో ఈ ప్రక్రియ కోసం కంపెనీలు కనీసం 30 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. మార్చి 31, 2026 నాటికి దేశంలో ఏఐఎఫ్ ఫండ్స్ సంఖ్య 1,849 కి చేరగా, వాటి మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.15.74 లక్షల కోట్లకు చేరడం విశేషం.

Next Story