SEBI : మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా? లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. నామినేషన్ నిబంధనలలో సెబీ కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ 2026 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఇన్వెస్టర్లు చనిపోయిన తర్వాత వారి ఆస్తులు కుటుంబ సభ్యులకు సులభంగా బదిలీ అవ్వడానికి, క్లెయిమ్ చేయని నిధుల సంఖ్యను తగ్గించడానికి సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు పెట్టుబడి ప్రక్రియను మరింత సరళంగా, డిజిటల్ ఫ్రెండ్లీగా మార్చనున్నాయి.

సెబీ కొత్త రూల్స్ ప్రకారం, సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైనా కొత్తగా సింగిల్ హోల్డర్ డీమ్యాట్ ఖాతా లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియో ఓపెన్ చేస్తే.. వారు నామినీ వివరాలను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నామినీని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే.. అందుకు సంబంధించిన డిక్లరేషన్ ఫారమ్ (ఆప్ట్-అవుట్) నింపి అధికారికంగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, జాయింట్ అకౌంట్లు, జాయింట్ ఫోలియోలకు మాత్రం నామినేషన్ అనేది ఇప్పటికీ ఆప్షనల్ గానే ఉంటుంది.

ఇకపై ఇన్వెస్టర్లు ఒకే డీమ్యాట్ ఖాతా లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో గరిష్టంగా ముగ్గురు నామినీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇన్వెస్టర్ మరణానంతరం సదరు నామినీలు అందరూ కలిసి ఉమ్మడిగా ఆ పెట్టుబడులను కొనసాగించవచ్చు లేదా వారి వాటా ప్రకారం విడివిడిగా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఆప్షన్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో డిజిటల్ సిగ్నేచర్ (DSC), ఆధార్ ఆధారిత ఈ-సైన్, ఓటీపీ ఆధారిత టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ద్వారా పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ లో కేవలం సాధారణ సంతకం పెడితే సరిపోతుంది, ఎలాంటి సాక్షుల సంతకాలు అవసరం లేదు. కానీ, సంతకం లేనివారు బొటనవేలు ముద్ర వేస్తే మాత్రం ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా ఉండాలి.

నామినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఫారమ్‌లో అడిగే వివరాలను సెబీ తగ్గించింది. ఇకపై నామినీ పేరు, ఇన్వెస్టర్‌తో ఉన్న బంధం, ఒకవేళ నామినీ మైనర్ అయితే వారి పుట్టిన తేదీ మాత్రమే తప్పనిసరిగా ఇవ్వాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కేవైసీ వివరాలు, ఎవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలనేది ఆప్షనల్. ఒకవేళ ఇన్వెస్టర్ ఎవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలో ఫారమ్‌లో చెప్పకపోతే.. సదరు పెట్టుబడి నామినీలందరికీ సమానంగా పంచబడుతుంది.

ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా నామినీని ఎప్పుడైనా యాడ్ చేయవచ్చు, మార్చవచ్చు లేదా పూర్తిగా తొలగించవచ్చునని సెబీ స్పష్టం చేసింది. నామినేషన్‌లో మార్పులు చేసిన ప్రతిసారీ సంబంధిత సంస్థలు ఇన్వెస్టర్‌కు రశీదు జారీ చేయాలి. ఇంకా నామినేషన్ చేయని వారికి లేదా ఆప్ట్-అవుట్ ఆప్షన్ ఎంచుకున్న వారికి నామినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఏడాదికి రెండుసార్లు ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్ ద్వారా అలర్ట్‌లు పంపుతారు. అలాగే అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు కూడా రిమైండర్ పాప్-అప్‌లు కనిపిస్తాయి.

ఇన్వెస్టర్ ఆకస్మికంగా మరణిస్తే, వారు కష్టపడి సంపాదించిన డబ్బు వారి కుటుంబానికి లేదా చట్టబద్ధమైన వారసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరడానికి నామినేషన్ చాలా ముఖ్యం. నామినీ లేకపోతే, కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి చట్టపరమైన పత్రాలను సమర్పించాల్సి వస్తుంది. భవిష్యత్తులో కుటుంబ సభ్యులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే సెబీ ఈ ముందస్తు చర్యలు తీసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story