SEBI : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. షేర్ల కొనుగోలు, పేమెంట్స్, సెక్యూరిటీల రిలీజ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ముఖ్యంగా డబ్బులు పూర్తిగా చెల్లించని షేర్ల విషయంలో బ్రోకర్లు అనుసరించాల్సిన నిబంధనలను మార్చడం ద్వారా ఇన్వెస్టర్లకు ఊరటనివ్వాలని సెబీ భావిస్తోంది. దీనివల్ల ఇన్వెస్టర్లకు షేర్లు త్వరగా చేతికి అందడమే కాకుండా మార్కెట్లో నగదు లభ్యత పెరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన షేర్లకు పూర్తి పేమెంట్ చేసేందుకు 5 ట్రేడింగ్ రోజుల సమయం ఉంటుంది. అయితే, తాజాగా సెబీ ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులను ప్రతిపాదించింది. దీని ప్రకారం బ్రోకర్లు తమ సొంత పాలసీల మేరకు ఈ సమయాన్ని తగ్గించుకునే వెసులుబాటును కల్పించనుంది. అంటే నిబంధనలు మరింత సరళంగా మారి, పనులు వేగంగా పూర్తవుతాయి.

ఇన్వెస్టర్లకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. సెక్యూరిటీలపై ఉన్న ప్లెడ్జ్ తొలగింపు. ఒకవేళ క్లయింట్ తన బకాయిలను సాయంత్రం 5 గంటల కంటే ముందే చెల్లిస్తే, అదే రోజున వారి షేర్లపై ఉన్న ప్లెడ్జ్‌ను తొలగించి షేర్లను రిలీజ్ చేయాలని సెబీ ప్రతిపాదించింది. ఒకవేళ 5 గంటల తర్వాత పేమెంట్ చేస్తే, మరుసటి ట్రేడింగ్ రోజున కచ్చితంగా ఆ షేర్లను విడుదల చేయాలి. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ షేర్లను త్వరగా అమ్ముకునే వీలుంటుంది.

సెబీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ బ్రోకర్ నిర్ణీత గడువులోగా సెక్యూరిటీల విడుదల కోసం పొడిగింపు కోరకపోతే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ షేర్లపై ఉన్న ప్లెడ్జ్‌ను తొలగిస్తుంది. అంటే, బ్రోకర్లు కావాలని షేర్లను ఆపడం ఇక కుదరదు. అలాగే, ఇన్వెస్టర్ పాక్షికంగా బకాయిలు చెల్లిస్తే, ఆ చెల్లించిన మొత్తానికి సమానమైన షేర్లను రిలీజ్ చేసే విధానాన్ని కూడా సెబీ పరిశీలిస్తోంది.

కొన్నిసార్లు మార్కెట్లో లోయర్ సర్క్యూట్ తగిలినా లేదా ట్రేడింగ్ సస్పెండ్ అయినా.. 5 రోజుల్లో షేర్లను అమ్మడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో బ్రోకర్లు డిపాజిటరీల నుండి అదనంగా వారం రోజుల సమయం కోరవచ్చు. పరిస్థితి చక్కబడే వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ, మార్కెట్ సాధారణ స్థితికి వచ్చిన వెంటనే అదనపు సమయం ఉండదు. ఈ ప్రతిపాదనలన్నీ అమల్లోకి వస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు మరింత భద్రత లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story