ఫుల్ KYC ఉంటేనే ఇక పెట్టుబడి

Mutual Fund Rules : భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్‌ను సురక్షితమైన, మంచి రాబడిని ఇచ్చే పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇందులో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్త. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మ్యూచువల్ ఫండ్స్‌లో ఖాతా ఓపెన్ చేయడం, పెట్టుబడి పెట్టడం కోసం కొత్త నియమాలను తీసుకురావాలని యోచిస్తోంది. దీని ద్వారా పెట్టుబడి మరింత సురక్షితంగా, సులభంగా మారుతుంది.

సెబీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే నియమాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. సెబీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇకపై మ్యూచువల్ ఫండ్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పెట్టుబడిదారుడి కేవైసీ డాక్యుమెంట్లు పూర్తిగా ధృవీకరించబడి ఉండాలి. ఒకవేళ కేవైసీ ధృవీకరణ పూర్తి కాకపోతే, వారు కొత్త మ్యూచువల్ ఫండ్ ఖాతాను ఓపెన్ చేయలేరు. పెట్టుబడి పెట్టలేరు. పెట్టుబడిదారుల కేవైసీ పత్రాలను కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ చివరిసారిగా తనిఖీ చేసి, వాటిని ధృవీకరిస్తుంది.

సెబీ ఈ కొత్త నిబంధనలను తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశం పెట్టుబడిదారులకు భద్రతను పెంచడం. పెట్టుబడిదారులకు సంబంధించిన అన్ని వివరాలు ఈమెయిల్, మొబైల్ ద్వారా నిరంతరం అందుతూ ఉంటాయి. దీనివల్ల లావాదేవీలలో పూర్తి స్పష్టత ఉంటుంది. ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు తమ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవలసి ఉంటుంది.

సెబీ ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలు కోరింది. ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను నవంబర్ 14వ తేదీలోగా సెబీకి పంపవచ్చు. ఈ కొత్త కేవైసీ నియమాలు అమలులోకి వస్తే, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి ప్రక్రియ మరింత మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టడం, ఖాతా ఓపెన్ చేయడం రెండూ మునుపటి కంటే మరింత పారదర్శకంగా మారుతాయి. తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం కారణంగా పెట్టుబడిదారులు నష్టపోవడం ఆగిపోతుంది.

అసంపూర్ణ సమాచారం వల్ల గతంలో క్లెయిమ్ ప్రక్రియ సమయంలో పెట్టుబడిదారులు ఎదుర్కొన్న సమస్యలు కొత్త నిబంధనల ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా ఏఎంసీలకు కూడా పెట్టుబడిదారులకు సంబంధించిన పనులు సులభతరం అవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story