Digital Gold : డిజిటల్ గోల్డ్‌పై సెబీ హెచ్చరిక.. అక్కడ కొంటే నష్టపోతే ఎవరూ ఆదుకోరు
అక్కడ కొంటే నష్టపోతే ఎవరూ ఆదుకోరు

Digital Gold : భారతదేశంలో బంగారంపై ఉన్న మోజు అంతా ఇంతా కాదు. టెక్నాలజీ మారడంతో బంగారంలో పెట్టుబడి పెట్టే విధానం కూడా మారింది. ముఖ్యంగా యువతలో కేవలం కొన్ని క్లిక్‌లతో కొనుగోలు చేయగలిగే డిజిటల్ గోల్డ్ ట్రెండ్ వేగంగా పెరిగింది. అయితే, ఇప్పుడు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఈజీ పెట్టుబడిపై ఒక పెద్ద హెచ్చరిక జారీ చేసింది. సెబీ ప్రకటనతో డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు.
సెబీ ఇటీవల ఒక సలహా జారీ చేసింది. డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులు తమ రెగ్యులేటరీ స్కోప్ నుంచి పూర్తిగా బయట ఉన్నాయని సెబీ స్పష్టం చేసింది. వీటిని సెబీ చట్టాల కింద సెక్యూరిటీలుగా గానీ, కమోడిటీ డెరివేటివ్‌లుగా గానీ పరిగణించడం లేదని పేర్కొంది. సెబీ నియంత్రణ లేకపోవడం వలన డిజిటల్ గోల్డ్ పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఉత్పత్తులకు సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్ వర్తించదు.
ప్లాట్‌ఫారమ్ ఆగిపోవడం లేదా మీరు కొనుగోలు చేసిన కంపెనీ దివాలా తీయడం వంటి సందర్భాల్లో, మీకు న్యాయ సహాయం అందించేందుకు ఎలాంటి పటిష్టమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేదు. కాబట్టి, మీ మొత్తం పెట్టుబడి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చాలా మంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, మీరు కొనుగోలు చేసిన డిజిటల్ బంగారం నిజంగా కంపెనీ వాల్ట్‌లో 1:1 నిష్పత్తిలో భద్రపరచబడి ఉందా లేదా అనేదానికి హామీ లేదు.
బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇప్పటికే సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని సెబీ గుర్తు చేసింది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్‌లు వంటి ఉత్పత్తులు సెబీ ద్వారా నియంత్రించబడతాయి. వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. ఈ ఆప్షన్లు ఫిజికల్ గోల్డ్ బ్యాకింగ్‌కు హామీ ఇస్తాయి.
సెబీ హెచ్చరిక నేపథ్యంలో ఇప్పటికే డిజిటల్ గోల్డ్ ఉన్నవారు ఏం చేయాలనే దానిపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు పెట్టుబడి సలహాదారులు, ముఖ్యంగా పెట్టుబడి పెద్ద మొత్తంలో ఉంటే, వెంటనే డిజిటల్ గోల్డ్‌ను అమ్మివేసి, సెబీ నియంత్రిత ఉత్పత్తులకు మారడం మంచిదని సూచిస్తున్నారు. చిన్న మొత్తంలో నష్టం వచ్చినా, మొత్తం పెట్టుబడి మునిగిపోయే రిస్క్ కంటే ఇదే సురక్షితం.

