LIC : ఉద్యోగం చేస్తున్నంత కాలం నెల తిరిగేసరికి మొబైల్‌కు వచ్చే సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ ఇచ్చే ధైర్యమే వేరు. కానీ రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ, ఆ మెసేజ్ ఆగిపోతే ఇల్లు ఎలా గడవాలి? అనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. షేర్ మార్కెట్లలో రిస్క్ తీసుకోవడం వయసు మళ్లిన వారికి సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసం దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ ఎల్‌ఐసీ అద్భుతమైన పెన్షన్ పథకాలను అందిస్తోంది. మీ రిటైర్మెంట్ ఫండ్‌ను సురక్షితంగా ఉంచుతూనే, ప్రతి నెలా మీకు ఒక స్థిరమైన ఆదాయాన్ని అందించే 4 పాపులర్ ప్లాన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పెన్షన్ ప్లాన్ అంటే ఏమిటి?

సాధారణ భాషలో చెప్పాలంటే, మీరు సంపాదించే కాలంలో కొంచెం కొంచెంగా ప్రీమియం కట్టడం లేదా రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి భారీ మొత్తాన్ని కంపెనీకి ఇవ్వడం. దీనికి బదులుగా ఎల్‌ఐసీ మీకు జీవితాంతం ప్రతి నెలా లేదా ఏడాదికి ఒకసారి ఫిక్స్‌డ్ అమౌంట్‌ను పెన్షన్ రూపంలో ఇస్తుంది.

ఎల్‌ఐసీలోని ఆ 4 మేటి పెన్షన్ ప్లాన్స్ ఇవే

జీవన్ అక్షయ్ VII : ఇది ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్. అంటే మీరు ఈ రోజు డబ్బులు డిపాజిట్ చేస్తే, వచ్చే నెల నుంచే మీ పెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడే రిటైర్ అయిన వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో మీ ఒక్కరికే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.

న్యూ జీవన్ శాంతి : ఇది డెఫర్డ్ యాన్యుటీ ప్లాన్. అంటే పెట్టుబడి ఈ రోజు పెడతాం కానీ, పెన్షన్ మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. మీరు ఇంకా ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ ప్లాన్ తీసుకుంటే, భవిష్యత్తులో వచ్చే పెన్షన్ రేటును ఇప్పుడే లాక్ చేసుకోవచ్చు.

సరళ్ పెన్షన్ : పేరుకు తగ్గట్టే ఇది చాలా సింపుల్ ప్లాన్. ఎలాంటి దాగి ఉన్న నిబంధనలు లేకుండా, ఒకేసారి డబ్బు కట్టి జీవితాంతం పెన్షన్ పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రిస్క్ అస్సలు వద్దనుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

న్యూ పెన్షన్ ప్లస్ : ఇది మార్కెట్ ఆధారిత ప్లాన్ (ULIP). ఇందులో మీ డబ్బు కొంత మేర షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టబడుతుంది. మీరు కొంచెం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండి, భవిష్యత్తులో పెద్ద మొత్తంలో పెన్షన్ ఫండ్ కావాలనుకుంటే దీనికి మొగ్గు చూపవచ్చు.

రూ.10 లక్షలు పెడితే ఎంత పెన్షన్ వస్తుంది?

మీకు వచ్చే పెన్షన్ మొత్తం మీ వయస్సు, మీరు ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 60 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, అతనికి నెలకు దాదాపు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే రూ.25 లక్షలు పెడితే రూ.13,000 నుంచి రూ.17,000 వరకు, రూ.కోటి డిపాజిట్ చేస్తే నెలకు రూ.55,000 నుంచి రూ.70,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్ద వయసు వారికి పెన్షన్ అమౌంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story