Fixed Deposit: ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితంతో పాటు క్రమబద్ధమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది నిజంగానే మంచి వార్త. దేశంలోని పలు చిన్న, పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా 8.5 శాతం వరకు అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మీ కష్టార్జితానికి రక్షణతో పాటు భారీ రాబడినిచ్చే బ్యాంకుల వివరాలు ఇవే.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ధమాకా

ప్రస్తుతం సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై గరిష్టంగా 8.50 శాతం వరకు వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇవే కాకుండా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు 8.30 శాతం వరకు ఆఫర్ చేస్తుండగా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.90 శాతం, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.75 శాతం చొప్పున రాబడిని ఇస్తున్నాయి.

ప్రైవేట్, విదేశీ బ్యాంకుల పోటీ

కేవలం చిన్న బ్యాంకులే కాకుండా దిగ్గజ ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సైతం డిపాజిట్‌దారులను ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. ఎస్‌బీఎమ్ బ్యాంక్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీ ఇస్తుండగా, డీసీబీ బ్యాంక్ 8.00 శాతం, బంధన్ బ్యాంక్ 7.95 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లలో ఈ రేటు 7.75 శాతంగా ఉంది. అలాగే ఆర్‌బీఎల్ బ్యాంక్ 7.70 శాతం, సిటీ యూనియన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.50 శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ 7.30 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.20 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు 7.10 శాతం చొప్పున చెల్లిస్తున్నాయి. విదేశీ బ్యాంకుల్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 7.10 శాతం, డ్యూచ్ బ్యాంక్ 7.00 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.

ప్రభుత్వ బ్యాంకుల్లో నమ్మకమైన రాబడి

ప్రభుత్వ రంగ బ్యాంకులపై నమ్మకం ఉంచే వారికి సైతం మంచి వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.45 శాతం వడ్డీ ఇస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 7.35 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం చొప్పున రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ 7.15 శాతం ఇస్తుండగా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 7.10 శాతం ఇస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.

పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిపాటి వడ్డీ తేడా కూడా దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) ఇచ్చే రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ రక్షణ కోసం ఒకే బ్యాంకులో కాకుండా వేర్వేరు బ్యాంకుల్లో డబ్బులను విభజించి డిపాజిట్ చేయడం శ్రేయస్కరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story