800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. హుషారుగా నిఫ్టీ

Stock Market : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ మంగళవారం (మార్చి 10, 2026) నాడు భారీ లాభాలతో దూసుకుపోయింది. సోమవారం నాటి భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు, ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో కళకళలాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సానుకూల పవనాలను తెచ్చిపెట్టింది. ఇరాన్ అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన సంకేతాలివ్వడం మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది.

దూసుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ

మంగళవారం ఉదయం మార్కెట్ మొదలవ్వడమే అదిరిపోయే గ్యాప్-అప్‌తో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ గత ముగింపు 77,566.16 పాయింట్ల వద్ద ఉండగా, ఏకంగా 809.57 పాయింట్లు పెరిగి 78,375.73 వద్ద ఓపెన్ అయింది. అటు నిఫ్టీ 50 కూడా 252.75 పాయింట్ల లాభంతో 24,280.80 స్థాయికి చేరింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాట పట్టాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 3.17 శాతం పెరగగా, హాంగ్ సెంగ్ 1.70 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఏకంగా 4.88 శాతం జంప్ చేశాయి.

భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు

యుద్ధం ముగుస్తుందన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు కుప్పకూలాయి. గత మూడు ఏళ్లలో లేని విధంగా పెరిగిన ధరలు, ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా 6 శాతం కంటే ఎక్కువగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92.45 డాలర్లకు పడిపోగా, డబ్ల్యూటీఐ ధర 88.65 డాలర్లకు చేరింది. భారతీయ మార్కెట్‎లో కూడా ముడిచమురు ధర 6 శాతం తగ్గి బ్యారెల్ రూ. 8,261 వద్ద ట్రేడ్ అయింది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద ఊరట.

యుద్ధంపై ట్రంప్ క్లారిటీ

ఫ్లోరిడాలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుందని, చాలా త్వరలోనే ముగుస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవాలని చూసే ఏ ఉగ్రవాద పాలనను తాము సహించబోమని హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ గనుక శాంతికి సహకరించకుండా మొండిగా వ్యవహరిస్తే, ఆ దేశం ఎప్పటికీ కోలుకోలేని విధంగా అత్యంత కఠినమైన సైనిక చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ ధీమాతో కూడిన ప్రకటన గ్లోబల్ ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story