Stock Market: 13 నిమిషాల్లోనే తలకిందులైన సీన్..1,450 పాయింట్లు పడిన సెన్సెక్స్
1,450 పాయింట్లు పడిన సెన్సెక్స్

Stock Market: భారత స్టాక్ మార్కెట్ సోమవారం (నవంబర్ 23)ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న ర్యాలీని అందుకుంటూ ఉదయం 9:15 గంటలకు రెండు ప్రధాన సూచీలు లాభాల్లో తెరుచుకున్నాయి. నిఫ్టీ 50 అర శాతం పెరిగి 25,929.15 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 0.6 శాతం ఎగబాకి 84,421.97 వద్ద ఓపెన్ అయ్యాయి. కానీ ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మార్కెట్ మొదలైన కేవలం 13 నిమిషాల్లోనే అంటే 9:28 గంటల సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి.
1,452 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఉదయం ట్రేడింగ్‌లో ఇంట్రా-డే ఒడుదొడుకులు ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేశాయి. సెన్సెక్స్ ముందుగా 743.25 పాయింట్లు ఎగబాకి 84,662.96 వద్ద రోజు గరిష్ఠాన్ని తాకింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 1,452.88 పాయింట్లు పడిపోయి 83,210.08 స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కూడా 192 పాయింట్లు పెరిగి 25,992.60కి వెళ్లి, అక్కడి నుంచి 425.30 పాయింట్లు కోల్పోయి 25,567.30కి పడిపోయింది. ఈ నెలలో ఇప్పటికే మార్కెట్లు సుమారు 12 శాతం పెరగడంతో గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడమే ఈ పతనానికి ఒక కారణం.
రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు
గత నాలుగు వారాలుగా భారత మార్కెట్‌కు అతిపెద్ద బలంగా నిలుస్తోంది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి రావడమే. ప్రాథమిక గణాంకాల ప్రకారం.. ఒక్క శుక్రవారమే విదేశీ ఇన్వెస్టర్లు భారత షేర్లలో రూ.10,308 కోట్లు పెట్టుబడి పెట్టారు. మొత్తం నవంబర్ నెలలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 13 బిలియన్ డాలర్లను భారత ఈక్విటీ మార్కెట్లో కుమ్మరించారు. ఈ భారీ పెట్టుబడులతో ఈ ఏడాది మొత్తం విదేశీ నిధుల ఉపసంహరణ 18.4 బిలియన్ డాలర్లకు తగ్గి, 2025 నాటి రికార్డు స్థాయి కంటే దిగువకు రావడం మార్కెట్‌కు పెద్ద ఊరటగా మారింది.
గ్లోబల్ ఏఐ షేర్ల అమ్మకాల సెగ
ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాలు ప్రస్తుతం మిశ్రమంగా ఉన్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం భారత మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చి, ఉదయం లాభాల్లో ఓపెన్ కావడానికి తోడ్పడింది. కానీ మరోవైపు గ్లోబల్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత షేర్లలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడటంతో భారత మార్కెట్ కూడా ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది.
16 రంగాల్లో 15 గ్రీన్
సోమవారం మార్కెట్ ప్రారంభమైనప్పుడు దాదాపు అన్ని విభాగాల్లోనూ కొనుగోళ్ల సందడి కనిపించింది. తొలి గంట మోగగానే మార్కెట్లోని 16 ప్రధాన రంగాల్లో 15 రంగాలు లాభాల్లో ట్రేడయ్యాయి. పెద్ద కంపెనీల షేర్లతో పాటు చిన్న, మధ్యతరహా కంపెనీల షేర్లలోనూ ఉత్సాహం కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు రెండూ ప్రారంభంలో 0.2 శాతం లాభంతో కదలాడాయి, కానీ ఆ తర్వాత వచ్చిన లాభాల స్వీకరణతో మార్కెట్ దిశ మారింది.

