Share Market : స్టాక్ మార్కెట్‌ను ముంచేసిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. నిమిషంలోనే రూ.3.75 లక్షల కోట్లు ఆవిరి
నిమిషంలోనే రూ.3.75 లక్షల కోట్లు ఆవిరి

Share Market : భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని చవిచూసింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న యుద్ధ వాతావరణం, విదేశీ పెట్టుబడిదారుల వరుస అమ్మకాల దెబ్బకు దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. మార్కెట్ ప్రారంభమైన కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషంలోనే ఇన్వెస్టర్ల సొమ్ము అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా వెలిగిన భారత్.. ఈ దెబ్బకు ఏడో స్థానానికి పడిపోయింది. మంగళవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వడమే భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ కూడా 0.5 శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. ఉదయం 9.16 గంటల సమయానికే సెన్సెక్స్ ఏకంగా 452 పాయింట్లు నష్టపోయి 73,815.12 వద్దకు పడిపోగా.. నిఫ్టీ 153 పాయింట్లు కోల్పోయి 23,229 మార్కు వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ అస్థిరతను కొలిచే ఇండియా విక్స్ 2.5 శాతం తగ్గి 16.13 శాతానికి చేరింది.
ఈ భారీ పతనంలో బజాజ్ ఫైనాన్స్ షేరు అత్యధికంగా 3 శాతం మేర నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీనితో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ షేర్లు 1 నుంచి 2 శాతం వరకు నష్టాల్లో కూరుకుపోయాయి. అయితే ఈ నష్టాల సముద్రంలో కూడా ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు 1 నుంచి 3 శాతం వరకు లాభపడి మార్కెట్‌కు కాస్త అండగా నిలిచాయి. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు దాదాపు 1 శాతం మేర పడిపోయాయి. ఈ తాజా మార్కెట్ క్రాష్ వల్ల అంతర్జాతీయంగా భారత స్టాక్ మార్కెట్ స్థానం మరింత దిగజారింది. తాజాగా సౌత్ కొరియా మార్కెట్ (KOSPI) మార్కెట్ క్యాప్ పరంగా మన దేశాన్ని వెనక్కు నెట్టి 6వ స్థానాన్ని ఆక్రమించింది. దీనితో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 7వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం వరకు 5వ స్థానంలో ఉన్న భారత్‌ను మొదట తైవాన్ మార్కెట్ దాటేయగా.. ఇప్పుడు సౌత్ కొరియా కూడా దాటేయడం గమనార్హం. మంగళవారం ఎన్‌ఎస్‌ఈ లో కేవలం 887 షేర్లు లాభాల్లో ఉండగా, ఏకంగా 1,650 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లడం వల్ల గ్లోబల్ మార్కెట్లు భయపడ్డాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి బీరూట్‌పై జరపాల్సిన పెద్ద దాడిని ఆపించానని, దానికి ఆయన సైన్యాన్ని వెనక్కి పిలిపించారని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఏప్రిల్ లో కుదిరిన తాత్కాలిక సంధిని పొడిగించే విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 95 డాలర్ల వద్దకు, డబ్ల్యూటీఐ క్రూడ్ 92 డాలర్ల వద్దకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం ఇంధన రవాణాలో 20 శాతానికి పైగా వాటా ఉండే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి ఈ యుద్ధం వల్ల ఎక్కువ కాలం మూతపడుతుందేమో అన్న భయాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. భారత మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ డబ్బును ఊహించని రేంజ్‌లో వెనక్కి తీసుకుంటున్నారు. సోమవారం ఒక్కరోజే దలాల్ స్ట్రీట్‌లో వీరు రూ.3,912 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతకుముందు మే 29న ఒకే సెషన్‌లో ఏకంగా రూ.22,102 కోట్ల భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి ఏకంగా రూ.2.47 లక్షల కోట్లను లాగేసుకున్నారు. కేవలం జనవరి నెలలో మాత్రమే వీరు మార్కెట్లో పాజిటివ్‌గా పెట్టుబడులు పెట్టారు.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ముఖ్య వ్యూహకర్త వి.కె. విజయ్‌కుమార్ అభిప్రాయం ప్రకారం.. అమెరికా, సౌత్ కొరియా, తైవాన్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. భారత్‌లో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే పెద్ద మైనస్ గా మారింది. దీనికి తోడు ఇంధన సంక్షేమం వల్ల దేశ జీడీపీ గ్రోత్ అంచనాలను తగ్గించి, ద్రవ్యోల్బణ అంచనాలను పెంచడం దేశీయ మార్కెట్లను దెబ్బతీసింది. తాజాగా భారత వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణ సగటు కంటే 90 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయడం వల్ల.. అది దేశ ఆర్థిక వృద్ధి, ధరలపై మరింత ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

