Share Market: షేర్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. 1300 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు పండగే
ఇన్వెస్టర్లకు పండగే

Share Market: భారతీయ స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఒడిదుడుకులకు బ్రేక్ పడింది. నేడు మార్కెట్లో అద్భుతమైన కోలుకోవడం (Recovery) కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఐటీ రంగ షేర్లలో జరిగిన బంపర్ కొనుగోళ్ల కారణంగా ప్రధాన సూచీలు భారీ లాభాలను చవిచూశాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్ల వరకు దూసుకెళ్లి 74,100 మార్కును దాటగా, నిఫ్టీ కూడా 23,000 స్థాయికి అతి సమీపంలో ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లలో నూతనోత్సాహాన్ని నింపింది.
క్రూడాయిల్ ధరల్లో భారీ తగ్గుదల
ఈ భారీ మార్కెట్ ర్యాలీ వెనుక అనేక బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊరటనిచ్చింది. అమెరికా చమురు నౌకలపై ఉన్న ఆంక్షలను సడలించే ఆలోచనలో ఉందనే వార్తల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 104 డాల్టర్ల దగ్గరికి పడిపోయింది. భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో, ఈ ధరల తగ్గిదల దేశీయ మార్కెట్‌పై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపింది. దీనితో పాటు అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు బలపడి 94.92 వద్ద ట్రేడ్ కావడం విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఐటీ రంగం అండతో దూసుకెళ్లిన దలాల్ స్ట్రీట్
గ్లోబల్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కారణంగా దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ భారీగా నష్టపోయినప్పటికీ, ఇది భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలకు కలిసొచ్చింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా దూసుకెళ్లి మార్కెట్‌ను నిలబెట్టింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ, ప్రైవేట్ బ్యాంకులు అందించిన బలమైన మద్దతుతో సూచీలు కుప్పకూలకుండా లాభాల బాటలో పయనించాయి. అయితే ప్రధాన స్టాక్స్ జోరుగా కొనుగోలుకు నోచుకున్నప్పటికీ, మిడ్-క్యాప్ మరియు స్మాల్-క్యాప్ సూచీలలో మాత్రం ఇంకా కొంత అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది.
వాల్యూ బైయింగ్ వ్యూహంతో లాభపడ్డ ఇన్వెస్టర్లు
గత కొన్ని రోజులుగా మార్కెట్లో జరిగిన భారీ పతనంతో అనేక అగ్రశ్రేణి కంపెనీల షేర్లు చాలా చౌకైన ధరలకు లభించాయి. దీన్ని గమనించిన నిపుణులు, స్మార్ట్ ఇన్వెస్టర్లు తక్కువ ధర ఉన్న బలమైన షేర్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. ఈ వ్యూహం నేడు మార్కెట్‌కు ఒక బలమైన పునాదిని కల్పించింది. మొత్తానికి పండగ సీజన్‌కు ముందు స్టాక్ మార్కెట్లో వచ్చిన ఈ ఊహించని బంఫర్ రికవరీ మదుపర్ల ముఖంలో చిరునవ్వులు పూయించింది.

