ఆ బిజినెస్ క్లోజ్ చేసిన శిల్పాశెట్టి

Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. వీరిద్దరిపై రూ. 60 కోట్ల మోసం ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో శిల్పా శెట్టి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఒక పెద్ద ప్రకటన చేశారు. ముంబైలోని ప్రముఖ, హై-ప్రొఫైల్ రెస్టారెంట్ బాస్టియన్ బాంద్రాను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ విషయాన్ని శిల్పా శెట్టి స్వయంగా తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

గురువారం శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాస్టియన్ బాంద్రా రెస్టారెంట్‌కు వీడ్కోలు చెబుతూ ఒక భావోద్వేగ నోట్ రాశారు. "ఈ గురువారం ఒక శకం ముగుస్తోంది. ముంబైలోని అత్యంత ఐకానిక్ డెస్టినేషన్స్‌లో ఒకటైన బాస్టియన్ బాంద్రాకు మేము వీడ్కోలు చెబుతున్నాము" అని ఆమె రాశారు. ఈ స్థలం కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదని, ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయమని ఆమె అన్నారు. అనేక విలువైన క్షణాలు, మరపురాని సాయంత్రాలు, సిటీ నైట్‌లైఫ్‌ను నిర్వచించిన ఎన్నో అద్భుతమైన సందర్భాలు ఇక్కడే జరిగాయని ఆమె పేర్కొన్నారు.

బాస్టియన్ బాంద్రా 2016లో ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ శిల్పా శెట్టి, ఆమె పార్టనర్ రంజిత్ బింద్రా ఉమ్మడి ప్రాజెక్ట్. రుచికరమైన ఆహారం, అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కారణంగా, ఈ రెస్టారెంట్ త్వరలోనే ముంబైలోని ఉన్నత వర్గాల వారికి, బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. 2023లో ఈ రెస్టారెంట్‌ను బాంద్రాలోని కొత్త ప్రదేశానికి మార్చారు. దీంతో దాని రూపం, అనుభూతి మరింత అద్భుతంగా మారాయి. అయితే, బాస్టియన్ బాంద్రా ప్రయాణం ఇక్కడితో ముగిసిందని శిల్పా ఇప్పుడు స్పష్టం చేశారు. రెస్టారెంట్ మూసివేయడానికి గల కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

శిల్పా-రాజ్‌లపై మోసం ఆరోపణల సమయంలోనే రెస్టారెంట్ మూసివేత వార్త రావడం గమనార్హం. శిల్పా, రాజ్ కుంద్రాపై రూ. 60 కోట్ల మోసం కేసు నమోదు అయింది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. ముంబై వ్యాపారవేత్త దీపక్ కోఠారి వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టారని, అయితే పెట్టుబడి, అప్పు పేరుతో తమను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసు 2015 నుంచి 2023 మధ్య కాలానికి సంబంధించినది. శిల్పా, రాజ్ తన రూ. 60 కోట్లను దుర్వినియోగం చేసి, వాటిని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నిధులను వ్యాపార విస్తరణ పేరుతో తీసుకున్నారు, కానీ వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా, వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story