భారీగా తగ్గిన బిజినెస్.. ఉద్యోగాలపై ప్రభావం ?

Indian IT : భారతదేశంలోని కొన్ని ఐటీ కంపెనీల బిజినెస్ భారీగా తగ్గుతోందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా, వివిధ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే చర్యలు చేపడుతున్నాయి. సహజంగానే, ఈ నేపథ్యంలో ఐటీ సేవల కోసం చేసే ఖర్చులకు కూడా కత్తెర వేస్తున్నారు. కమ్యూనికేషన్స్ టుడే నివేదిక ప్రకారం.. భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ గత సంవత్సరంతో పోలిస్తే తమ ముఖ్యమైన క్లయింట్ల నుండి చాలా తక్కవు బిజినెస్ పొందాయి. ఇది ఐటీ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.

భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తమ ప్రధాన క్లయింట్ల నుంచి ప్రాజెక్టులను కోల్పోతున్నాయి. సిటిగ్రూప్, పోస్ట్‌బ్యాంక్ నుండి టీసీఎస్‌కు లభిస్తున్న ప్రాజెక్టుల సంఖ్య తగ్గింది. ఈ రెండు కంపెనీలు టీసీఎస్ అతిపెద్ద క్లయింట్‌ల జాబితాలో ఉన్నాయి. పోస్ట్‌బ్యాంక్ అనేది డ్యూష్ బ్యాంక్ అనుబంధ సంస్థ. ఇక, ఇన్ఫోసిస్ విషయానికి వస్తే, వారి ప్రముఖ క్లయింట్ అయిన డైమ్లర్ ఏజీ కంపెనీ కూడా తక్కువ వ్యాపారాన్ని అందించింది. డైమ్లర్ ఏజీ ఒక జర్మన్ ఆటోమోటివ్ కంపెనీ.

పెద్ద కంపెనీలకే కాకుండా, ఇతర చిన్న ఐటీ కంపెనీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 'ది మింట్' పత్రిక నివేదిక ప్రకారం.. హెగ్జావేర్ టెక్నాలజీస్ సంస్థకు ఫ్యాని మీ (Fannie Mae) కంపెనీ నుండి లభిస్తున్న వ్యాపారం తగ్గింది. ఫ్యాని మీ అనేది హెగ్జావేర్ టెక్నాలజీస్ మూడు ప్రధాన క్లయింట్‌లలో ఒకటి. అదేవిధంగా, ఎంపసైస్ కంపెనీకి ఫెడెక్స్ (FedEx) నుండి వచ్చే వ్యాపారం కూడా తగ్గింది. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, సొనాటా సాఫ్ట్‌వేర్ వంటి కంపెనీలకు మైక్రోసాఫ్ట్ నుండి లభిస్తున్న వ్యాపారం కూడా తగ్గిందని 'లైవ్ మింట్' పత్రిక నివేదించింది.

భారత ఐటీ రంగం మొత్తం ఆదాయంలో గణనీయమైన క్షీణత కనిపించనప్పటికీ, కొన్ని ఐటీ కంపెనీల ముఖ్యమైన క్లయింట్ల నుండి వ్యాపారం గణనీయంగా తగ్గడం మాత్రం వాస్తవమని తెలుస్తోంది. అయితే, దీనిపై ఐటీ కంపెనీల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కంపెనీలకు ఆదాయం తగ్గితే, సహజంగానే అవి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాయి. దీని పర్యవసానంగా, ఉద్యోగ కోతలు ఉంటాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, వ్యయ నియంత్రణ చర్యలు భారత ఐటీ రంగాన్ని ఎంతకాలం ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story