Financial Planning: 2 లక్షల క్రెడిట్ కార్డ్ బిల్లు Vs 5 లక్షల పర్సనల్ లోన్.. మొదట ఏ అప్పు తీర్చాలి?
మొదట ఏ అప్పు తీర్చాలి?

Financial Planning: నేటి ఆధునిక కాలంలో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రుణాలు తీసుకోవడం చాలా సాధారణమైపోయింది. ఇందులో పర్సనల్ లోన్‌తో పాటు క్రెడిట్ కార్డ్ వాడకం కూడా పెరిగిపోయింది. అయితే ఒకేసారి రెండు రకాల అప్పుల భారంతో సతమతమయ్యే వారికి అసలు సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు రూ.2లక్షల క్రెడిట్ కార్డ్ బకాయి, రూ.5 లక్షల పర్సనల్ లోన్ ఒకేసారి చెల్లించాల్సి వస్తే చాలామంది ముందుగా పెద్ద మొత్తంలో ఉన్న లోన్‌ను తీర్చాలని భావిస్తారు. కానీ ఫైనాన్షియల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి.
వడ్డీ రేట్ల ఆధారంగానే ప్రథమ ప్రాధాన్యత
అప్పులను తీర్చేటప్పుడు ఏ అప్పుకు ఎక్కువ వడ్డీ పడుతుందో గమనించడం చాలా ముఖ్యం. జైగల్ వ్యవస్థాపకుడు రాజ్ పి నారాయణన్ తెలిపిన వివరాల ప్రకారం, ఏ అప్పును ముందు తీర్చాలనే నిర్ణయం బకాయి ఉన్న మొత్తం మీద కాకుండా వడ్డీ రేట్ల ఆధారంగా తీసుకోవాలి. పర్సనల్ లోన్‌పై సాధారణంగా 12 నుంచి 18 శాతం వరకు వార్షిక వడ్డీ పడుతుంది. కానీ క్రెడిట్ కార్డ్ బిల్లు సమయంలోపు చెల్లించకపోతే ఆ వడ్డీ రేటు ఏకంగా 36 నుంచి 42 శాతం వరకు భారీగా పెరుగుతుంది. మినీ ఈఎంఐ డాట్ ఏఐ సీఈఓ కపిల్ మఖీజా పేర్కొన్నట్లుగా, రూ.2లక్షల క్రెడిట్ కార్డ్ అప్పు రూ.5లక్షల పర్సనల్ లోన్ కంటే చాలా ప్రమాదకరమైనది. అందువల్ల ముందుగా ఎక్కువ వడ్డీ ఉన్న బకాయిలను క్లియర్ చేయడమే సరైన మార్గం.
మినిమం డ్యూ చెల్లించే ప్రమాదకర అలవాటు
క్రెడిట్ కార్డ్ వాడేవారు చేసే అతిపెద్ద పొరపాటు భారీ బిల్లు రాగానే కేవలం 5 శాతం మినిమం డ్యూ అమౌంట్ చెల్లించి చేతులు దులుపుకోవడం. అలా చేయడం వల్ల తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తారు. కానీ మిగిలిన మొత్తంపై 40 శాతం వరకు వడ్డీ పేరుకుపోతూ ఉంటుంది. ఈ వడ్డీ చక్రవ్యూహం కారణంగా వ్యక్తి క్రమంగా మరింత లోతైన అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అందువల్ల కేవలం మినిమం అమౌంట్ చెల్లించే పద్ధతిని పూర్తిగా మానుకోవాలి. వీలైనంత త్వరగా క్రెడిట్ కార్డ్ పూర్తి బకాయిలను ఒకేసారి చెల్లించడానికి ప్రణాళిక వేసుకోవాలి.
సిబిల్ స్కోర్ పై పడే ప్రభావం
మీరు అప్పులు చెల్లించే పద్ధతి మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను ఎల్లప్పుడూ పూర్తిగా వాడుతుంటే అది హై యూటిలైజేషన్గా పరిగణించబడి మీ సిబిల్ స్కోర్‌ను వేగంగా తగ్గిస్తుంది. మరోవైపు పర్సనల్ లోన్ ఈఎంఐలను ప్రతి నెల సక్రమంగా చెల్లిస్తూ ఉంటే అది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. అందువల్ల పర్సనల్ లోన్ ఈఎంఐలు సక్రమంగా కొనసాగిస్తూ, క్రెడిట్ కార్డ్ భారీ బకాయిలను వీలైనంత త్వరగా క్లియర్ చేయడం ఉత్తమం.
ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ముందుగా బడ్జెట్ తయారు చేసుకుని ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదా చేయాలి. ఆ మిగిలిన డబ్బుతో పాటు ఏవైనా బోనస్‌లు వస్తే నేరుగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి ఉపయోగించాలి. ఒకవేళ ఏకమొత్తంగా చెల్లించడం కుదరకపోతే క్రెడిట్ కార్డ్ బకాయిలను తక్కువ వడ్డీ ఉన్న ఈఎంఐలుగా మార్చుకోవడం ద్వారా భారీ వడ్డీ భారం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

