Silver Prices : బంగారం బాటలోనే ఇప్పుడు వెండి కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లేలా కనిపిస్తోంది. వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటి వరకు వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం చాలా సులభంగా ఉండేది. కానీ, ఇకపై వెండిని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ కేంద్రం దీనిని రిస్ట్రిక్టెడ్ జాబితాలోకి మార్చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో వెండి సరఫరా తగ్గి, ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డాలర్ల కోసం వెండిపై ఆంక్షలు

ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎకానమీ అల్లకల్లోలంగా ఉంది. దీనివల్ల భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. మనం విదేశాల నుంచి వెండి కొనుగోలు చేసినప్పుడు ఆ పేమెంట్ డాలర్లలో చేయాల్సి ఉంటుంది. దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెండి, బంగారంపై కస్టమ్స్ డ్యూటీని కూడా ప్రభుత్వం 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచడం గమనార్హం.

ఏయే వస్తువులపై ప్రభావం?

కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి బిస్కెట్లు, పౌడర్ రూపంలో ఉండే వెండి, అలాగే సెమీ-మాన్యుఫ్యాక్చర్డ్ సిల్వర్‌ను విదేశాల నుంచి తేవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్స్ లేదా అనుమతి ఉండాల్సిందే. మన దేశంలో వెండి ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటంతో, మనం దాదాపు మొత్తం అవసరాల కోసం విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఇప్పుడు దిగుమతుల ప్రక్రియ క్లిష్టంగా మారడం వల్ల వ్యాపార వేత్తలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

పెరగనున్న ప్రీమియం ధరలు

దిగుమతులు తగ్గితే సహజంగానే మార్కెట్లో వెండికి డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ కంటే మన దేశీయ మార్కెట్లో వెండి ధరలు చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి కేవలం నగలు, బిళ్లలకే పరిమితం కాదు.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీలో దీని వాటా చాలా ఎక్కువ. సరఫరా తగ్గిపోతుందనే భయంతో వ్యాపారులు ఇప్పుడే వెండిని స్టాక్ చేయడం మొదలుపెడితే, ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించడం ఖాయం. రానున్న రోజుల్లో వెండిపై అదనపు ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story